కార్యక్రమంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం , ఆనందపురం(భీమిలి): రాష్ట్రంలో కురుక్షేత్రం మొదలైందని, ఈ యుద్ధంలో అవినీతితో కూరుకుపోయిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించి జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. అందుకు ప్రతీ నాయకుడు, కార్యకర్త కంకణబద్ధులై ముందుకు నడవాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బంక సత్యం అధ్యక్షతన ఆనందపురంలో శుక్రవారం నిర్వహించిన భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను నాశనం చేసే గంటా లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వరాదని, అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్లు, సీట్లు కోసం జగన్ మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయలేదని, అట్టడుగు సామాజికవర్గాల సంక్షేమాన్ని కాంక్షించి వైఎస్సార్ పాలనను తిరిగి తేవడానికే సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: బూడి
శాసనసభాపక్ష ఉపనేత, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకొని రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేయడంతో రాష్ట్రాభివృద్ధి జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని భావించి అవంతి శ్రీనివాస్ పార్టీలోకి వచ్చారన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లపై పోరాటం చేయకుండా సొంత ఎంపీలనే కట్టడి చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
హోదా గురించి ప్రస్తావిస్తే సీఎం మందలించేవారు
వైఎస్సార్‌సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, ఆయన అనుచరగణం భూకబ్జాలు, అవినీతి గురించి చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లినా పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి ఎప్పడు ప్రస్తావించినా మందలించేవారని, అలాంటి ముఖ్యమంత్రితో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించి తాను జగన్‌మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీలోకి వచ్చానని స్పష్టం చేశారు. భీమిలిలో గట్టిగా పునాది వేసిన తన శ్రమ ఫలితంగానే గంటా గెలవగలిగారన్నారు. పార్టీ పార్టమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్ మాట్లాడుతూ అవంతి శ్రీనివాసరావు గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఇక్కడ ప్రజలు మరలా ఇక్కడకు రావాలని కోరుకోవడంతోనే ఆయన విజయం ఖరారైందన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ అవంతి విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు.
పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల సమన్వయకర్తలు కె.కె.రాజు, పి.వి.రమణమూర్తి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శరగడం చిన్న అప్పలనాయుడు, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నియోజకవర్గాల సమన్వయకర్తలు అదీప్‌రాజు, గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, యు.కన్నబాబు రాజు, పార్టీ సీయూసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి, విశాఖ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, సుంకరి గిరిబాబు, డి.గోపిరాజు, కోరాడ వెంకటరావు, చందక బంగారునాయుడు, ఆనందపురం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కనకల రామారావు తదితరులు పాల్గొన్నారు.
భారీగా టీడీపీ నాయకుల చేరిక
సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, వారి అనుచరులు వైఎస్సార్‌సీపీలో భారీ సంఖ్యలో చేరారు. భీమిలి మండలం రేఖవానిపాలెం మాజీ సర్పంచ్ సమ్మిడి శ్రీనివాస్, భీమిలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లి కోటిరెడ్డి, మూలకుద్దు మాజీ ఉపసర్పంచ్ కొయ్యి రామకృష్ణ, చిప్పాడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గిరజాల రమణ, పద్మనాభం మండలం పాండ్రంగి ఎంపీటీసీ పాలూరి స్వామినాయుడు, కోన అప్పలనాయుడు, కర్రోతు రాంబాబు, మద్ది గ్రామం నుంచి కనకాల నాయుడు, ఆనందపురం మండలం, చందక మాజీ ఉప సర్పంచ్ పాలూరి అప్పలస్వామి, సహకార సంఘం మాజీ డైరెక్టర్ యర్ర రామకృష్ణతో పాటు ఆయా నాయకులు, ముఖ్య అనుచరులు సుమారు 300 మంది వరకు పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment