
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కేసు పరిష్కారం కాకుండా వైఎస్సార్‌సీపీ అడ్డుపడుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన ఆరోపణలను బొత్స తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసి బాధితులకు అన్యాయం చేయాలని చూస్తున్న ప్రభుత్వ పెద్దలు వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. గతంలో సదావర్తి సత్రం భూములను కొట్టేయాలని చూస్తే.. వైఎస్సార్‌సీపీ అడ్డుకట్ట వేసిందని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్సెల్ గ్రూపు ప్రతినిధులు ముందుకు రాకుండా.. ఢిల్లీలో చంద్రబాబు అర్ధరాత్రి రహస్య చర్చలు సాగించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు.
కేబినెట్ మంత్రులు వివరణ ఇవ్వరా?
ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వచ్చినా కేబినెట్ మంత్రులు వివరణ ఇచ్చేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని బొత్స ప్రశ్నించారు. ‘అగ్రిగోల్డ్ వ్యవహారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరిధిలోకి వస్తుంది. ఆయన మాత్రం పెదవి విప్పకుండా కుటుంబరావుతో మాట్లాడిస్తున్నారని’ తెలిపారు. గతంలో సత్యం కుంభకోణం వెలుగు చూసిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి.. ఆ సంస్థను స్వాధీనం చేసుకుని ఉద్యోగులను ఆదుకోవాలని, వాటాదారులకు సాయంగా ఉండాలని, విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని బొత్స గుర్తు చేశారు. నాలుగన్నరేళ్లు రాష్ట్ర సమస్యలను గాలికొదిలి.. ఓట్ల కోసం కడప స్టీల్ ప్లాంట్, ఎయిర్‌పోర్టు, పోర్టులకు శంకుస్థాపన చేసి మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. కాగా, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును జాతీయ విచారణ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించడం శుభపరిణామమని బొత్స అన్నారు. హైకోర్టు విభజననను కూడా తాను ఇచ్చిన లేఖకు భిన్నంగా రాజకీయం చేయడం బాబుకే చెల్లిందని బొత్స దుయ్యబట్టారు. టీడీపీ, జనసేన పార్టీలు ఒకే పక్షమని..బయటకు మాత్రం అప్పుడప్పుడూ తిట్టుకుంటూ విడిపోయామని కలరింగ్ ఇస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు టీడీపీ నేతలను ప్రతిచోటా నిలదీస్తున్నారని గుర్తుచేశారు.
చుక్కల భూముల పేరుతో అతి పెద్ద స్కాం
చుక్కల భూముల పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ జరుగుతోందని బొత్స అన్నారు. ఈ భూములను ఒకే సామాజికవర్గం వారికి చెందేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందట కదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ‘ ఎందుకు సుప్రీం కోర్టుకు వెళుతున్నారు. హత్యాయత్నం వారి కుట్ర కాదా? చంద్రబాబు, నారా లోకేష్, డీజీపీ భాగస్వామ్యం ఇందులో లేదా? నిజంగా వారి ప్రమేయం లేకపోతే ఎందుకు ఎన్‌ఐఏ విచారణను అడ్డుకోవాలి?’ అని బొత్స ప్రశ్నించారు. రాజధాని నిర్మించకుండానే గ్రాఫిక్స్‌లో అద్దాల కలలు చూపిస్తున్నారని, ప్రజా సమస్యలను వదిలేసి విదేశీ పర్యటనలు, సభలకు ప్రజాధనం వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment