ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
కర్నూలు, డోన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యురాలు కోట్ల సుజాతమ్మ.. వైఎస్సార్‌సీపీ నాయకులపై నిందలు వేయడం మానుకోవాలని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు. తన గృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సుజాతమ్మకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె డోన్ నుంచి పోటీ చేయడంపై వైఎస్సార్‌సీపీకి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఆమెపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం వైఎస్సార్‌సీపీకి లేదన్నారు. గత ఎన్నికల్లో ఆమె ఆలూరు నుంచి పోటీ చేశారని, డోన్ నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి సహకరించాలని కార్యకర్తలకు సూచించారన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే.. సుజాతమ్మ మాత్రం నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే డోన్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు.
అరాచక పాలన కనిపించదా?
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న టీడీపీ నాయకులను పల్లెత్తు మాట మాట్లాడకుండా కేవలం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓడిస్తామని కోట్ల దంపతులు ప్రకటిస్తుండడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారని బుగ్గన అన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయం కోసం వచ్చే ఎన్నికల్లో కోట్ల దంపతులు పోటీ చేస్తున్నారా అనే విషయంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని బుగ్గన డిమాండ్ చేశారు.
మిఠాయిలు పంచిందెవరో తెలియదా ?
డోన్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని ప్రకటించిన వెంటనే టీడీపీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి స్వీట్లు (మిఠాయిలు) పంపిణీ చేశారని, ఈ విషయం సుజాతమ్మకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని బుగ్గన అన్నా రు. వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేసి, స్వప్రయోజనాల కోసం ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీలోకి చేరారన్నారు. ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని కోట్ల దంపతులు ఎందుకు ఖండించడం లేదన్నారు. టీడీపీ నాయకుల అరాచకాలు, అవినీతి పనుల మూలంగా నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్‌సీపీకి వచ్చే ఎన్నికల్లో పట్టం గట్టడం ఖాయమని బుగ్గన ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో డోన్, ప్యాపిలి జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, పార్టీ సీనియర్ నాయకుడు చిన్నకేశవయ్య గౌడ్, మండల, పట్టణ కమిటీ అధ్యక్షులు మల్లెంపల్లె రామచంద్రుడు, కోట్రికె హరికిషన్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment