
సాక్షి, అమరావతి: భయంతో విశాఖవాసులు రోడ్లపై నిద్రపోతున్నారని, సీఎం జగన్ ఎక్కడున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. అక్కడి స్థానికులు న్యాయం కోసం వీధుల్లో ఆందోళనలు చేస్తున్నారని ట్విట్టర్‌లో తెలిపారు. తాము ప్రేమించే వారి కుళ్లిపోయిన శవాలను పక్కన పెట్టుకుని రోదిస్తున్నారని తెలిపారు. కానీ ఇప్పటికీ ఒక్క ఆస్తిని కూడా సీజ్ చేయలేదని, ఒక్క వ్యక్తినీ అరెస్టు చేయలేదని విమర్శించారు. గ్యాస్ లీకేజీ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీకి చంద్రబాబు శనివారం లేఖ రాశారు. లేఖలోని అంశాలు..
► గ్యాస్ లీకేజీ ఘటనపై మీరు చూపిన సత్వర స్పందన మాకు ఎంతో ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరుతున్నాను.
► మీ సూచనల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ వెంటనే రంగంలోకి దిగి లీకైన గ్యాస్‌ను న్యూట్రల్ చేసింది. మీరు వెంటనే తీసుకున్న చర్యలు, చూపిన సానుభూతిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
► మరికొన్ని తీసుకోవాల్సిన చర్యలు, సూచనలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
► గ్యాస్ లీకేజీ ఘటన ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు సైంటిఫిక్ నిపుణుల కమిటీ వేయాలి.
► కంపెనీ స్టైరీన్ గ్యాస్ లీకైనట్లు చెబుతున్నా ఇతర గ్యాసెస్ కూడా ఉన్నట్లు వస్తున్న నివేదికలతో వారి వాదనపై అనుమానాలు ఉన్నాయి.
► ఘటనపై విచారణ జరిగితే అక్కడివారి ఆరోగ్యంపై ఎంత మేర ప్రభావం చూపుతుందో అర్థంచేసుకోవచ్చు.
► చికిత్స పొందుతున్న వారిలో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోగిని దీర్ఘకాలికంగా పర్యవేక్షించేలా, వారి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను నిర్వహించాలి. దీనివల్ల బాధితుల్లో నమ్మకం ఏర్పడుతుంది.
► విశాఖలో గాలి నాణ్యతపై పర్యవేక్షిస్తుండాలి.
► ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.