సాక్షి, అమరావతి : ఆకాశాన్నంటే మేడలు.. రాజభవనాలను తలదన్నే కట్టడాలు.. కనుచూపు మేర కళ్లు చెదిరేలా కళాత్మక భవంతులు.. ఇంద్రుడికే కన్ను కుట్టేలా ఐకానిక్ స్ట్రక్చర్లు.. జపాన్, మలేషియా, సింగపూర్.. అన్నీ కలిస్తే అమరావతి అట.. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు.. అంతా కనికట్టు.. విశ్వవిఖ్యాతి గాంచిన ఇంద్రజాలికులకే సాధ్యం కాని చంద్రజాలం.. రాజధాని అమరావతిని భ్రమరావతిగా మార్చిన వైనం.. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో ఆరితేరిన జగజ్జెట్టీలకే ఆశ్చర్యం.. పగటి వేషగాళ్లే నివ్వెరపోయేలా మాయ మాటల చాతుర్యం.. ఐదు కోట్ల ఆంధ్రుల కలల సౌధం.. దూరం.. దూరం..
2015 అక్టోబర్ 22
అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ చంద్రబాబు అట్టహాసంగా ప్రధాని మోదీతో అమరావతికి శంకుస్థాపన చేయించిన రోజు... ఏకంగా 53వేల ఎకరాలు గుప్పిటపట్టారు... బాహుబలి సినిమాను తలదన్నే గ్రాఫిక్స్‌ను మీడియా మేనేజ్‌మెంట్‌తో బురిడీ కొట్టిస్తూ రాజధాని సినిమా చూపించారు. మూడున్నరేళ్ల తరువాత అమరావతిలో వాస్తవ చిత్రం చూస్తే చంద్రబాబు మాయాజాలం కళ్లకు కడుతోంది. వేలాది ఎకరాలు ఖాళీగా పడిఉన్నాయి... రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యానికి, చంద్రబాబు భూదందాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
నాణేనికి ఓవైపు...
ఆ ఇంద్రలోకపు ‘అమరావతి’... భూలోకంలో మన చంద్రుడికే సాధ్యమన్నారు. అహోరాత్రులు కష్టపడి...అజరామరమైన నగరాన్ని నిర్మిస్తాడన్నారుదేశ విదేశాలన్నీ చుట్టొచ్చి...అన్నిటిని తలదన్నే రాజధాని
కడతాడన్నారు. కాలికి బలపం కట్టుకుని...కలలోనైనా ఊహించని కానుకిస్తాడన్నారు
నాణేనికి మరోవైపు...
భవిష్యత్ అవసరాలకంటూ...బలవంతంగానైనా భూ సేకరణ ఆకృతుల ఖరారు కోసమంటూ... అనవసర కాలయాపన ఆ కంపెనీలు, ఈ కంపెనీలంటూ... ఎకరాలకు ఎకరాలు సంతర్పణ ఈ రోడ్డు, ఆ రోడ్డు అంటూ... దారితెన్నూ లేని గమనం
వెరసి...
ఒక్క శాతం భూమిలోనే ‘అమరావతి’ ఆకారం... చూపినదంతా అరచేతి వైకుంఠం ఆ కథేంటో మీరూ చదవండి.
అరచేతిలో స్వర్గం అంటే ఏమిటో తెలియాలంటే చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న రాజధాని గ్రాఫిక్స్ చూడాలి. కొండను తవ్వి ఎలకను పట్టడం అంటే... అమరావతి ప్రాంతాన్ని సందర్శించాలి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ ఈ ఐదేళ్లలో చంద్రబాబు బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో ప్రజలకు డిజైన్లు, గ్రాఫిక్‌లు చూపించారు. ఇదే పేరు చెప్పి ఏకంగా 53 వేల ఎకరాలను గుప్పిట పట్టారు. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ అంటూ హడావుడి చేశారు.
కానీ, 50 నెలల సుదీర్ఘ సమయం తర్వాత అమరావతి వెళ్లి చూస్తే కనిపించేది ఏమిటంటే!? 53 వేల ఎకరాల్లో 99 శాతం ఖాళీగా పడి ఉన్న భూములు... కేవలం 500 ఎకరాల్లో సాగుతున్న పొడిపొడిగా పనులే! పైపైచ్చు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా హడావుడి చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే... రాజధాని పేరిట ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ప్రజలను రంగుల కలతో భ్రమల్లో ఉంచింది. ఆ అరచేతి వైకుంఠం ఎలా ఉందంటే...
తీసుకున్న ఎకరాలు 50,000 పనులు మొదలు పెట్టిన ఎకరాలు 500
రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ చంద్రబాబు ప్రభుత్వం 53,581 ఎకరాలు తీసుకుంది. అందులో ప్రభుత్వ భూమి 15 వేల ఎకరాలు మాత్రమే. 29 గ్రామాల్లో రైతుల నుంచి భూ సమీకరణ పేరుతో 38,581 ఎకరాలు తీసుకునేందుకు గురిపెట్టారు. రైతులపై సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఇప్పటికి 33,208 ఎకరాలు సమీకరించారు. మరో 3,800 ఎకరాలను భూ సేకరణ అస్త్రంతో లాక్కునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇలా 53 వేల ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నా... వాస్తవంగా అసలైన రాజధాని ప్రాంత నిర్మాణానికి కేటాయించింది కేవలం 1,350 ఎకరాలు మాత్రమే. అందులోనూ ప్రస్తుతం కేవలం 500 ఎకరాల్లోనే నిర్మాణ పనులు అదీ తూతూమంత్రంగా సాగుతున్నాయి. అంటే, కేవలం ఒక్క శాతం భూమిలోనే ప్రభుత్వం పనులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. మిగిలిన వేలాది ఎకరాలు నిర్జనంగా పడి ఉన్నాయి.
సీన్ లేని ‘సీడ్ యాక్సస్’
60 అడుగుల వెడల్పు, 21.50 కి.మీ. పొడవునా చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారితో అమరావతిని అనుసంధానిస్తూ సీడ్ యాక్సస్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. మొదటి దశలో వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు 13.50 కి.మీ, రెండో దశలో విజయవాడ కనకదుర్గ వారధి నుంచి ఉండవల్లి వరకు 8 కి.మీ. నిర్మించాలన్నది ప్రతిపాదన. రాజధాని గ్రామాలకు నీరు, విద్యుత్, కేబుల్, గ్యాస్ సరఫరాకు భూగర్భ కేబుళ్ల వ్యవస్థ కోసం సీడ్ యాక్సస్ రోడ్డును అనుసంధానిస్తూ భూగర్భ పవర్ డక్ట్‌లు వేయాలి.
మొత్తం రూ.579 కోట్ల కాంట్రాక్టును చంద్రబాబు సన్నిహిత సంస్థకు అప్పగించారు. 9 నెలల్లో పూర్తి చేస్తామని బాబు స్వయంగా ప్రకటించారు. రెండున్నరేళ్లు గడిచినప్పటికీ పనులు సగం కూడా కాలేదు. ఐదు ప్రదేశాల్లో పవర్ డక్ట్‌లకు గాను రెండుచోట్ల మొదలుపెట్టి మధ్యలో నిలిపివేశారు. మిగిలిన మూడు అతీగతి లేదు. జాతీయ రహదారితో రాజధానిని అనుసంధానిస్తూ రెండో దశ పనులను ఇంతవరకు ప్రారంభించనే లేదు.
కానరాని రహదారి
రాజధానిలో అంతర్జాతీయ స్థాయి రోడ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆచరణలో బొక్కబోర్లా పడింది. అమరావతిలో ఏడు ఎక్స్‌ప్రెస్ రహదారులతో పాటు మొత్తం 320 కి.మీ. మేర 34 రహదారులను నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. 7 ఎక్స్‌ప్రెస్ రహదారులను 6 వరుసలుగా, 27 ఇతర రహదారులను ఆరు వరుసలుగా నిర్మిస్తారు. అందుకు ఏకంగా రూ.14 వేల కోట్లతో ప్రణాళిక ఆమోదించింది. అయిదు ప్రధాన రహదారులతో పాటు మరో 27 రోడ్లకు టెండర్లు పిలిచారు.
2017 మార్చి 30న వీటికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. సరిగ్గా రెండేళ్లయినా ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయింది. మొత్తం 34 రోడ్లలో ప్రస్తుతం 24 రోడ్ల పనులే ప్రారంభించారు. ఆ పనులు కూడా పైపైనే సాగుతున్నాయి. అయిదు ప్రాధాన్య రహదారుల్లో ఒక్కటీ సిద్ధం కాలేదు. ఎటుచూసినా మధ్యలో నిలిచిన పనులు, గుంతలే దర్శనమిస్తున్నాయి. వర్షం వస్తే ఈ గుంతల్లో భారీగా నీరు చేరుతోంది. వీటిలో పడి ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే... భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతుల అనుమతి లేకుండానే వారి పొలాల మీదుగా రోడ్డు పనులు చేస్తూ బెదిరింపులకు పాల్పడటం.
భూములు సొంతం... పనులు చేయం
85 సంస్థలకు 1,375 ఎకరాలు ధారాదత్తం అమరావతి కేంద్రంగా ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు భూములు ధారాదత్తం చేశారు. ఒక్కో సంస్థకు ఎకరా నుంచి 200 ఎకరాల వరకు కేటాయించారు. ఇప్పటివరకు 85 సంస్థలకు 1,375 ఎకరాలు ఇలా ఇచ్చారు. వీటిలో ఆరు సంస్థలకు ఎంత చొప్పున భూమి ఇవ్వాలన్నదీ స్పష్టంగా పేర్కొనకపోవడం గమనార్హం. మిగిలిన 79 సంస్థలకు 1,343 ఎకరాలు కేటాయించింది. ప్రైవేటు సంస్థలకు ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకే కట్టబెట్టి... కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులకు మాత్రం ఎకరా రూ.4 కోట్లు చొప్పున ఇచ్చారు.
85 సంస్థల్లో మూడు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించాయి. అవి కూడా విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత లాంటి విద్యా సంస్థలు మాత్రమే. మిగిలిన సంస్థలేవీ పనుల ఊసే ఎత్తడం లేదు. ముఖ్య నేతకు ముడుపులిచ్చి మరీ భూములు పొందడంతో ఆ సంస్థలు నిబంధనలను ఖాతరు చేయడం లేదు. గడువులోగా పనులు ప్రారంభించని సంస్థల నుంచి భూములను వెనక్కుతీసుకోవాలి. ప్రభుత్వానికి ఆ ధ్యాసే లేదు.
వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment