ఏపీ పొత్తుకు శ్రీకారం | Chandrababu meeting with Congress leader Ashok Gehlot At Undavalli | Sakshi
Sakshi News home page

ఏపీ పొత్తుకు శ్రీకారం

Published Sun, Nov 11 2018 3:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Chandrababu meeting with Congress leader Ashok Gehlot At Undavalli - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తుకు దాదాపు రంగం సిద్ధమైంది. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలంటే రెండు పార్టీలు చేతులు కలపక తప్పదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దూత, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపా రు. గెహ్లాట్‌ శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో గంటకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. 

ప్రధానంగా 3 కీలక అంశాలపై చంద్రబాబుతో చర్చించేందుకు రాహుల్‌ గాంధీ తన దూతగా అశోక్‌ గెహ్లాట్‌ను అమరావతికి పంపించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకే బాబు, గెహ్లాట్‌ మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాపై చంద్రబాబు అభిప్రాయాన్ని ఈ సమావేశంలో అశోక్‌ గెహ్లాట్‌ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఖరారైన 74 మంది అభ్యర్థులతోపాటు ఇంకా ఖరారు చేయాల్సిన 19 అసెంబ్లీ స్థానాలపై చంద్రబాబు కొన్ని మార్పులను సూచించారు. ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయో తెలియజేశారు. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులతో తాను చేయించిన సర్వేల ఫలితాలను కూడా ఆయన ప్రస్తావించారు.

త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాలపైనా బాబు, గెహ్లాట్‌ మాట్లాడుకున్నట్లు సమాచారం. తెలంగాణలో మహాకూటమిని గెలిపించడమే లక్ష్యంగా చంద్రబాబు వివిధ మార్గాల్లో భారీ స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరుస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలుడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీలో టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తుపై చంద్రబాబు, అశోక్‌ గెహ్లాట్‌ ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 6 లోక్‌సభ స్థానాలు, 25 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని గెహ్లాట్‌ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానాల జాబితాను కూడా బాబు ముందుంచినట్లు సమాచారం. కర్నూలు, రాజంపేట, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అరకు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టుందని, వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాలను తమకే వదిలేయాలని గెహ్లాట్‌ కోరారు. ఈ అంశంపై రాహుల్‌ గాంధీ, చంద్రబాబు మధ్య జరిగే తదుపరి చర్చల్లో మంతనాలు కొనసాగే అవకాశం ఉంది. 

రాహుల్‌ దూతగా వచ్చా: గెహ్లాట్‌
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌కు శనివారం గన్నవరం విమానాశ్రయంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి గెహ్లాట్‌ నేరుగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు. దేశంలో మోదీ వ్యతిరేక రాజకీయ పక్షాలన్నీ కలిసి మహా కూటమిగా ఏర్పడి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా ముందడుగు వేయాలని కోరారు. ఇందులో భాగంగానే గత నెలలో సీఎం చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశారని చెప్పారు. రాహుల్‌ గాంధీ దూతగా తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించేందుకు వచ్చినట్లు అశోక్‌ గెహ్లాట్‌ వెల్లడించారు. 

23న అమరావతికి రాహుల్‌ గాంధీ రాక! 
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నెల 23వ తేదీన ఏపీ రాజధాని అమరావతికి రానున్నట్లు సమాచారం. అదే రోజు సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారని, ప్రత్యేక హోదా సాధన కోసం అమరావతిలో నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 23వ తేదీన వీలు కాకపోతే మరో రోజు రాహుల్‌ గాంధీని అమరావతికి రప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు.  

నా చొరవతోనే బీజేపీ వ్యతిరేక కూటమి 
సాక్షి, అమరావతి:  దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి తాను చొరవ తీసుకుంటున్నానని, సీనియర్‌ సిటిజెన్‌గా బాధ్యతతో ఈ పని చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజాస్వామ్య అనివార్యత కోసమే తాను కాంగ్రెస్‌ పార్టీ కలిశానని అన్నారు. మిగిలిన పార్టీలతోనూ చర్చించిన తర్వాత సీట్ల పంపకం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.  

ప్రమాదంలో ప్రజాస్వామ్యం  
దేశంలో బీజేపీ అనుకూల, వ్యతిరేకంగా పార్టీలే పని చేస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల నాయకులతో మాట్లాడానని చెప్పారు. త్వరలో ఆ పార్టీలన్నింటితో ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్, తాను కలిసి మిగిలిన పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానిస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నిర్ణయించడంతోపాటు భవిష్యత్తు కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే అన్ని పార్టీలతో మాట్లాడానని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశానని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ సమావేశమవుతానని చంద్రబాబు తెలిపారు.

కాంగ్రెస్‌తో కలిసిన నేపథ్యంలో టీడీపీ యూపీఏలో చేరినట్లేనా అని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ... బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కొన్ని యూపీఏలో చేరలేదన్నారు. అన్ని పార్టీలతో కూటమి ఏర్పాటైన తర్వాత స్పష్టత వస్తుందని, జాతీయ ఎజెండాతో ముందుకెళతామన్నారు. కాంగ్రెస్‌తో కలిసిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను నెరవేరుస్తారనే గ్యారంటీ ఏమైనా ఉంటుందా అనే ప్రశ్నకు జవాబిస్తూ.. మొదటి దేశ ప్రయోజనాలు ముఖ్యమని, ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు చూస్తామన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చేయించారని, కాంగ్రెస్‌ హయాంలో ఈ తరహా దాడులు జరగలేదని, ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.  

మా అజెండా సేవ్‌ డెమొక్రసీ, సేవ్‌ నేషన్‌  
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటిసారి టీడీపీతో కలిసి పని చేస్తున్నామని అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో ఇప్పుడున్న ఎన్డీయేలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీకి చెందిన కుబేరుల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి తప్ప నోట్ల రద్దు దేనికి పనికిరాలేదని విమర్శించారు. సేవ్‌ డెమొక్రసీ, సేవ్‌ నేషన్‌ తమ ప్రధాన అజెండా అని చెప్పారు. ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో బీజేపీయేతర పార్టీలన్నింటినీ కాంగ్రెస్‌ తరఫున సమావేశానికి ఆహ్వానిస్తామన్నారు. మీడియా సమావేశంలో గెహ్లాట్‌కు శాలువా కప్పి చంద్రబాబు సన్మానించారు. అరకు కాఫీ, బుద్ధుడి బొమ్మను బహూకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement