సాక్షి, విశాఖపట్నం : నిస్సహాయస్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు మోసాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని బీజేపీ దగాకోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం భారీ ఎత్తున ‘వంచన వ్యతిరేక దీక్ష’ చేపట్టారు. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా వేదిక వద్దకు తరలివచ్చారు. వంచన దీక్షను ప్రారంభిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. వంచనతో కూడిన ఆలోచనలు చేసే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాధ్యత, నైతికత చంద్రబాబుకు లేవని ఘాటుగా దుయ్యబట్టారు. విశాఖ రైల్వే జోన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన తమ నాయకుడిని విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకుని అవమాన పరిచింది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు.
మరో ఎమ్మెల్యే అంజద్ బాషా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని చంద్రబాబు ఉద్దేశించి విమర్శించారు. 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని, ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందన్నారు. 15 ఏళ్ల హోదా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. హోదా విభజన హామీలను నెరవేర్చకుండా బీజేపీ, టీడీపీలు మోసం చేశాయని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, హోదా కోసం ఎందాకైనా పోరాడతామని చెప్పారు. నాలుగేళ్ల నుంచి హోదా కోసం పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌సీపీనేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలో మోసపూరిత పాలన నడుస్తోందని, దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం మనందరిపైనే ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment