
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సినీ రచయిత చిన్నికృష్ణ
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతిలో మరోసారి మోసపోవద్దని కాపులకు ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ విజ్ఞప్తి చేశారు. కాపులంటే మెగా ఫ్యామిలీ మాత్రమే కాదని.. తాము కూడా కాపులమేనన్నారు. ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే నీకెందుకు అంత భయమని పవన్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో ఉంటున్న ఆంధ్రులమంతా సంతోషంగానే ఉన్నామని చెప్పారు.
రాజకీయం కోసం రాష్ట్రాలను విడదీయొద్దని.. ప్రజల జీవితాలతో ఆటలాడొద్దని పవన్‌కు సూచించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయొద్దని కోరారు. తాను కూడా కాపు బిడ్డనేనని.. నీ మాటలతో రెచ్చిపోయి హైదరాబాద్‌లో తమపై ఎవరైనా దాడి చేస్తే ఎవరు రక్షిస్తారని చిన్నికృష్ణ ప్రశ్నించారు. పవన్ వచ్చి రక్షిస్తాడా? ఆయన అన్న నాగబాబు వచ్చి రక్షిస్తాడా? అని నిలదీశారు.
ఎన్నో రికార్డులను తిరగరాసిన ఇంద్ర వంటి సినిమాను చిరంజీవికి ఇస్తే కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన వీళ్లు.. ఒక్కసారైనా తమకు ఓట్లు వేసిన ప్రజల్ని కలిశారా? అని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని.. ముందు రాజకీయ ఓనమాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌రాక లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమవుతుంటే.. ఏ రోజైనా టీడీపీ ప్రభుత్వాన్ని అడిగావా అని పవన్‌ను చిన్నికృష్ణ ప్రశ్నించారు.
మళ్లీ కాపులను మోసం చేస్తున్న ఘనత పవన్‌దేనన్నారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన కుమ్మక్కై వైఎస్ జగన్ ఒక్కడ్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ ఇప్పటికీ పూర్తి కాలేదని.. ఇక చంద్రబాబు అమరావతి ఎలా పూర్తి చేస్తారని చిన్నికృష్ణ ప్రశ్నించారు. వైఎస్ జగన్ రూపకల్పన చేసిన నవరత్న పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్‌సీపీ ఘన విజయం తధ్యమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.