
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. ఇది సిద్ధాంతపరమైన పోరాటమని, వేర్వేరు ఆలోచనల సంఘర్షణ అని వ్యాక్యానించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు.
కాంగ్రెస్ ఓటమికి పూర్తిగా తనదే బాధ్యతన్నారు. ఓటమికి కారణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమీక్ష చేస్తుందని చెప్పారు. అమేథీలో తాను ఓడిపోయానని గుర్తు చేశారు. తనపై గెలిచిన స్మృతి ఇరానీకి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రేమతో అమేథీ అభివృద్ధికి కృషి చేయాలని స్మృతి ఇరానీని కోరుతున్నట్లు వెల్లడించారు.