మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
తిర్యాణి: మండలంలోని పంగిడిమాదర గ్రామ శివారులో గురువారం రాత్రి రెండు లారీలలో అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడిన సంఘటనలో అధికారులు దోషులను పట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలప రవాణాలో అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కలప లారీలు పట్టుబడి రెండు రోజులు గడుస్తున్నా కలప ఎక్కడికి పోతుంది, అది ఎవరిది, అని అధికారులు నిర్ధారించలేకపోతున్నారన్నారు. కలప రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు దోషులను పట్టుకునే వరకు తాము ఊరుకునేది లేదని ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ప్రభుత్వం ఒక వైపు హరితహారం కార్యక్రమం పెట్టి అడవులను అభవృద్ధి చేయాలని చెపుతున్నా అధికార పార్టీ నాయకులు మాత్రం అడవులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల అవినీతిలో అధికారులు భాగస్వాములు కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహించాలన్నారు. అటవీ సంపద బాహాటంగా తరలిపోతున్నా, అటవీ అధికారులు. పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అడవిలోని వంట చెరుకును తీసుకొస్తేనే అటవీ అధికారులు అమాయకులపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద మొత్తంలో కలప అక్రమంగా తరలిపోతుంటే వారు ఏమి చేస్తున్నట్లన్నారు. గ్రామాలలో ప్రతి గ్రామానికి గ్రామ పొలీస్ అధికారిని నియమించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసులు ఏమి చేస్తున్నట్లన్నారు.
అటవీ శాఖామంత్రి ఇలాఖాలోనే కోట్లాది రూపాయల కలప దందా కొనసాగడం శోచనీయమన్నారు. అక్రమంగా అటవీ సంపదను దోచుకుంటున్న వారు ఎంతటి వారైనా అధికారులు పట్టుకోవాలన్నారు. పక్షపాతం లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమలో పీసీసీ సభ్యులు విశ్వప్రసాదరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి అనిల్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లం వెంకటేశం, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షులు బాలేశ్వర్‌గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంగ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకంగౌరయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బాదిరావు, నాయకులు బ్రహ్మం, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment