
జైపూర్ : దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన రాజస్తాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసమ్మతి నేత సచిన్ పైలట్ వర్గానికి స్పీకర్ జారీచేసిన అర్హత వేటు నోటీసులపై హైకోర్టులో ఓ వైపు విచారణ జరుగుతుండగా.. సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తన వర్గంలోకి వస్తే రూ. 35 కోట్లు ఇస్తామంటూ తిరుగుబాటు నేత ఆఫర్ ఇచ్చారని జైపూర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాంబు పేల్చారు. అంతేకాకుండా అశోక్ గెహ్లత్ ప్రభుత్వాన్ని కూల్చిందుకు సహకరించాలని కోరినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిరాజ్ సింగ్ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. మరోవైపు హర్యానాలో ఉన్న తమ ఎమ్మెల్యేలతో బేరాసారాలు కుదుర్చుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని సచిన్ పైలట్ వర్గం నేతలు విమర్శిస్తున్నారు. (కోర్టు తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా)
ఇదిలావుండగా.. స్పీకర్ జారీచేసిన షోకాజు నోటీసులపై హైకోర్టులో విచారణ సాగుతోంది. పైలట్‌తో పాటు 18 ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారని, సభాపతి తీసుకున్న నిర్ణయంలో కోర్టు జోక్యం సరికాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్వీ వాదించారు. కాంగ్రెస్ వాదనను పైలట్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే తీవ్రంగా తప్పుబట్టారు. అసమ్మతి తెలియజేయడమంటే పార్టీ ఫిరాయించినట్లు కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.