తప్పిన రెబెల్స్‌ బెడద  | Dissident Leaders Backwards With Fondness In Telangana | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 23 2018 3:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Dissident Leaders Backwards With Fondness In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెబెల్స్‌ బెడద పెద్దగా లేకపోవడంతో ప్రధాన రాజకీయపార్టీలు ఊపిరిపీల్చుకున్నాయి. అసంతృప్త నేతలను బుజ్జగించడంలో ఆయా పార్టీలు దాదాపు సఫలీకృతమయ్యాయి. టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు, కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు తిరుగుబాటు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో నాలుగింట కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉండటంతో అక్కడ స్నేహపూర్వకపోటీలు అనివార్యమయ్యాయి. మొత్తం మీద కూటమి పక్షాలు– కాంగ్రెస్‌ 99, టీడీపీ 13, టీజేఎస్‌ 8, సీపీఐ 3 చోట్ల బరిలో నిలిచాయి. 

ఫలించిన కేటీఆర్‌ దౌత్యం 
టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన నేత లను బుజ్జగించడంలో మంత్రి కేటీఆర్‌ సఫల మయ్యారు. వారి భవిష్యత్తుపై హామీలిచ్చి పోటీలో ఉండకుండా నివారించగలిగారు. దాదాపు 25 స్థానాల్లో తిరుగుబాట్లకు అవకాశముండగా, ఆరు మాత్రమే మిగిలాయి. కోరుకంటి చందర్‌ (రామగుండం), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), జి.వినోద్‌ (బెల్లంపల్లి), మన్నె గోవర్ధన్‌రెడ్డి (ఖైరతాబాద్‌), గజ్జెల నగేశ్‌ (కంటోన్మెంట్‌), తోకల శ్రీనివాస్‌రెడ్డి (రాజేంద్రనగర్‌)లు టీఆర్‌ఎస్‌ రెబల్స్‌గా పోటీలో నిలిచారు. వీరిలో కోరుకంటి చందర్, సత్యనారాయణరావు, శ్రీనివాస్‌రెడ్డిలు ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి సింహం గుర్తుపై, మన్నె గోవర్దనరెడ్డి, జి.వినోద్‌ బహుజన సమాజ్‌ పార్టీ నుంచి ఏనుగు గుర్తుపై బరిలో ఉన్నారు. గజ్జెల నగేశ్‌ మాత్రం ఇండిపెండెంట్‌గానే పోటీలో ఉన్నారు.  

హైదరాబాద్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం 
కాంగ్రెస్‌ అసంతృప్తులను బుజ్జగించేందుకు ఏకంగా కాంగ్రెస్‌ అధిష్టానమే హైదరాబాద్‌కు చేరుకుంది. సోనియా, రాహుల్‌ మినహా ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలంతా మూడు, నాలుగురోజులుగా ఇక్కడే మకాం వేసి రెబల్స్‌ను బుజ్జగిస్తున్నారు. కీలక నేతలు అహ్మద్‌పటేల్, జైరాం రమేశ్, డి.కె.శివకుమార్, జైపాల్‌రెడ్డితోపాటు మధుయాష్కీగౌడ్, వి.నారాయణస్వామి, మల్లాడి కృష్ణమూర్తి, సుబ్బిరామిరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తిరుగుబాటు అభ్యర్థుల ఇండ్లకు, కార్యాలయాలకు వెళ్లి వారి భవిష్యత్తుపై హామీలిచ్చారు. దీంతో చాలా చోట్ల రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇందులో శేరిలింగంపల్లి, మేడ్చల్, అంబర్‌పేట, వరంగల్‌ వెస్ట్, స్టేషన్‌ఘన్‌పూర్, చేవెళ్ల, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఉప్పల్, కోరుట్ల, పెద్దపల్లి తదితర నియోజకవర్గాలున్నాయి. అలకవీడని బిల్యానాయక్‌ (దేవరకొండ), ఎన్‌.రత్నాకర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌), ఎ.చంద్రశేఖర్‌ (వికారాబాద్‌), ఊకె అబ్బయ్య (ఇల్లెందు), బోడ జనార్దన్‌ (చెన్నూరు), శివకుమార్‌రెడ్డి (నారాయణపేట), మద్దెల రవీందర్‌ (ధర్మపురి) రెబల్స్‌గా బరిలో ఉన్నారు.  

నాలుగు అటు, నాలుగు ఇటు 
కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా 94 స్థానాల్లో పోటీ చేయాల్సిన కాంగ్రెస్‌ 99 చోట్ల పార్టీ గుర్తుపై బరిలో నిలిచింది. అంబర్‌పేటలో లక్ష్మణ్‌యాదవ్, వర్దన్నపేటలో కాంగ్రెస్‌ కొండేటి శ్రీధర్‌ కూడా పోటీ నుంచి వైదొలిగారు. మద్దుల నాగేశ్వర్‌రెడ్డి (దుబ్బాక), వద్దిరాజు రవిచంద్ర(వరంగల్‌ఈస్ట్‌)లు బరిలోనే ఉన్నారు. కాంగ్రెస్‌ పోటీచేస్తున్న స్థానాల్లో టీజేఎస్‌ అభ్యర్థులు మిర్యాలగూడ, చెన్నూరు, మెదక్, అశ్వారావుపేటలలో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌రాథోడ్‌పై బీంరావు, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుపై విజయ్‌లు టీజేఎస్‌ తరపున బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ కేటాయించిన మహబూబ్‌నగర్‌లో టీజేఎస్‌ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి సామరంగారెడ్డి (టీడీపీ)పై కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు.  

మూడింట రెండు చోట్ల... 
పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన బెల్లంపల్లి, హుస్నాబాద్, వైరా స్థానాల్లో రెబల్స్‌ బెడద తప్పలేదు. బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి వినోద్, వైరాలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి రాములునాయక్‌ పోటీలో నిలిచారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ రెబల్‌గా అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్‌ వేసినప్పటికీ దాన్ని రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడంతో సీపీఐ ఊపిరిపీల్చుకుంది.  

ఆ మూడు చోట్ల... 
బీజేపీతోపాటు బీఎల్‌ఎఫ్, సమాజ్‌వాదీ పార్టీలకు ఈసారి ఎన్నికల్లో చిన్న షాక్‌లు తగిలాయి. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత షాద్‌నగర్‌లో మాజీ మంత్రి శంకర్రావు (సమాజ్‌వాదీ పార్టీ), కుత్బుల్లాపూర్‌లో కాసాని వీరేశం (బీజేపీ), ముషీరాబాద్‌లో నగేశ్‌ ముదిరాజ్‌ (బీఎల్‌ఎఫ్‌)లు కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకున్నారు.  
 
కాంగ్రెస్‌ రెబల్స్‌ ఉన్న నియోజకవర్గాలు: 
వికారాబాద్, ఇల్లెందు, నారాయణపేట, చెన్నూరు, దేవరకొండ, నిజామాబాద్‌ (అర్బన్‌), ధర్మపురి 
 
టీఆర్‌ఎస్‌ రెబల్స్‌: 
రామగుండం, భూపాలపల్లి, బెల్లంపల్లి, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కంటోన్మెంట్‌ 
 
కాంగ్రెస్‌ వర్సెస్‌ టీజేఎస్‌: 
దుబ్బాక, వరంగల్‌ (ఈస్ట్‌), ఖానాపూర్, ఆసిఫాబాద్‌ 
 
కాంగ్రెస్‌ రెబల్‌ వర్సెస్‌ టీడీపీ:  
ఇబ్రహీంపట్నం 
 
కాంగ్రెస్‌ రెబల్‌ వర్సెస్‌ సీపీఐ:  
వైరా 
 
కూటమిలో నామినేషన్లు ఉపసంహరించుకున్న నియోజకవర్గాలు 
మిర్యాలగూడ(టీజేఎస్‌), అంబర్‌పేట(కాంగ్రెస్‌), చెన్నూరు (టీజేఎస్‌), మహబూబ్‌నగర్‌ (టీజేఎస్‌), మెదక్‌ (టీజేఎస్‌), అశ్వారావుపేట (టీజేఎస్‌). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement