
సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా రెండో మారు ఎన్నిక కావడంతో అధికార పార్టీకి సంబంధించి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.ఎన్నికల ఏడాదిలో మళ్లీ పదవి దక్కించుకున్న సీఎం రమేశ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి మంత్రి ఆదికి విభేదాలు ఉన్నాయి. తాను నివాసం ఉంటున్న పోట్లదుర్తి గ్రామం మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. సీఎం రమేశ్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ప్రోత్సహిస్తుండటంతోపాటు తన క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రత్యేకించి ఎర్రగుంట్ల మండలంలో అనేక సందర్భాల్లో ఇరువర్గాల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. మంత్రి పదవి ఏడాదితో ముగియనుంది. సీఎం రమేశ్ ఆరేళ్లు పదవిలో ఉండనున్నారు. అదేసందర్భంలో మంత్రి ఆదికి చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నారు.
ప్రొద్దుటూరు : జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది.. వీరి మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్నాయి.. రెండో సారి రాజ్యసభ సభ్యుడి పదవీ కోసం సీఎం రమేశ్ ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు.. ఆయనకు మోకాలొడ్డడానికి ఆదినారాయణరెడ్డి ప్రయత్నించారు.. రమేశ్‌కు ప్రత్యామ్నాయంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరును సీఎం చంద్రబాబు వద్ద ఆయన ప్రతిపాదించారు. అయితే ఎట్టకేలకు రమేశే ఆ పదవి దక్కించుకున్నాడు. ఆయన ప్రతివ్యూహంగా ఆదినారాయణరెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
నేడు స్వగ్రామానికి ఎంపీ రాక: ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా రెండో సారి ఎన్నికైన అనంతరం తొలిమారు స్వగ్రామానికి శనివారం వస్తున్నారు. ఈ సందర్భంగా కడప ఎయిర్‌పోర్టు నుంచి పోట్లదుర్తి వరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రమేశ్ ఎంపికతో అటు జమ్మలమడుగు, ఇటు ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో రాజకీయం వేడెక్కింది. భవిష్యత్తులో రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, సీఎం రమేశ్.. వీరిద్దరిదీ ఒకే నియోజకవర్గం (జమ్మలమడుగు) కావడంతో.. వారి వర్గాల మధ్య తొలి నుంచి విభేదాలు ఉన్నాయి.
ఆదినారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు సీఎం రమేశ్‌తో పోటీ పడే వారు. 2014 ఎన్నికలు పూర్తవుతూనే ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లను సీఎం రమేశ్ తీసుకెళ్లడం.. అదే సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆది ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో తీవ్ర స్థాయిలో పోట్లదుర్తి సోదరులపై విమర్శలు చేయడం జరిగింది. ఎర్రగుంట్ల పరిధిలోని సుందరయ్య నగర్‌లో ఏడాది క్రితం సబ్‌స్టేషన్ నిర్మించగా.. ఇద్దరి పోటీ కారణంగా ఇప్పటి వరకు సిబ్బందిని నియమించలేదు. ఎర్రగుంట్ల నగర పంచా యతీకి సంబంధించి ఓ చౌకదుకాణం విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ సందర్భంగా ఆదినారాయణరెడ్డి పోట్లదుర్తి సోదరులనుద్దేశించి బహిరంగంగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. గండికోట ప్రాజెక్టు పునరావాస పనులు తమకు దక్కలేదన్న ఉద్దేశంతో ఇటీవల ఆది, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులు.. కొండాపురంలోని సీఎం రమేశ్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
శ్రీనివాసరెడ్డిని ప్రతిపాదించిన ఆది
సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యునిగా రెండో మారు పోటీ చేసేందుకు ఇటీవల తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవి ఇవ్వాలని ఆది సీఎం చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టారు. సీఎం రమేశ్‌ను అడ్డు తొలగించుకోవాలన్న కారణంతోనే.. మంత్రి ఇలా చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు సీఎం రమేశ్‌ను ఎంపీ పదవి వరించింది.
ఏర్పాట్లలో ముందున్న నేతలు
సీఎం రమేశ్ శనివారం స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎర్రగుంట్ల వరకు అక్కడక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ర్యాలీకి వాహనాలు సమకూర్చడంతోపాటు అన్ని పనుల్లో ముందున్నారు. తొలి నుంచి సీఎం రమేశ్ రామసుబ్బారెడ్డిని బలపరుస్తున్నారు. కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వీరశివారెడ్డి ఇటీవల ప్రకటించడంతో కమలాపురం రాజకీయం రసకందాయంగా మారింది. టికెట్ కోసమే వీరశివారెడ్డి సీఎం రమేశ్‌తో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పుత్తా నరసింహారెడ్డికే టికెట్ వస్తుందని జనవరిలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో మంత్రి ఆది ప్రకటించడం గమనార్హం.
ప్రొద్దుటూరులో వరదతో...
ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాలకు సంబంధించి వరదరాజులరెడ్డికి సీఎం రమేశ్‌తో పూర్తి స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన మైదుకూరు – బద్వేలు హైవే రోడ్డు టెండర్ నుంచి సీఎం రమేశ్ నామినేషన్ రోజు జరిగిన ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు టెండర్ల వరకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. సీఎం రమేశ్ రాక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గీయులైన వీఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డితోపాటు పలువురు కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్తియార్ సీఎం రమేశ్‌కు 60 వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వరద మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. తొలి నుంచి సీఎం రమేశ్ ప్రొద్దుటూరుపై దృష్టి సారిస్తున్నారు. అదే నేపథ్యంలో వరద వారిని వ్యతిరేకిస్తున్నారు.