
సి.రామచంద్రయ్య (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుభవముందని ప్రజలు ఓట్లు వేస్తే ఆ అనుభవాన్ని దోచుకోవడానికి, దాచుకోవడానికే ఉపయోగించారని కాంగ్రెస్ మాజీ మంత్రి సి. రామచంద్రయ్య విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, దీనికి నిదర్శనం కాగ్ రిపోర్టేనని ఆరోపించారు. అసెంబ్లీ ఆఖరి రోజున కాగ్ రిపోర్ట్ రావడం వల్ల కొన్ని విషయాలు చర్చకు రాలేదని, మొదట్లో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెడితే చర్చకు తావు ఉండేదని ఆయన అభిప్రాయ పడ్డారు.
చంద్రబాబు ప్రపంచం అంతా తిరిగి అప్పులు తీసుకువచ్చారని, ఆ భారం అంతా ప్రజలపైనే పడుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 32 శాతం అప్పులే కట్టాలన్నారు. డబ్బును దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదని విమర్శించారు. చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల 2018-19 చివరినాటికి రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment