
సాక్షి, అమరావతి: బతికున్నప్పుడు హింసించడం, చనిపోయాక శవరాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని, అలాంటి నీచ రాజకీయాలు చేయడం వైఎస్సార్‌సీపీకి చేతకాదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి చంద్రబాబే పరోక్ష కారణమని ఆయన దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కోడెల మృతి బాధాకరమని, వైఎస్సార్‌సీపీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. కోడెల మరణవార్త విన్నవెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు అందరూ సంతాపం వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు మాత్రం ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర చేస్తున్నాడన్నారు. అంత సానుభూతి ఉన్నవ్యక్తే అయితే ఇటీవల కోడెల తీవ్ర అనారోగ్యానికి గురైతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
శవం పక్కన నిలబడి రాజకీయమా?
కోడెల శివప్రసాద్ మృతి చెందిన తరువాత శవం పక్కన నిలబడి శవరాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రెస్‌మీట్లు పెడుతూ అధికార పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోడెలను మూడు నెలల నుంచి ఒక్కరోజు అయినా పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లలేదన్నారు. ఇబ్బందులు ఏమిటని అడగలేదన్నారు. పైగా కోడెలను అవమానించే రీతిలో సత్తెనపల్లి, నరసారావుపేటలో ఆయన వ్యతిరేక గ్రూపును ప్రోత్సహించి పార్టీ కార్యక్రమాలు మీరే చేపట్టండి అని వారికి ఆదేశాలు ఇవ్వడంతోనే కోడెల మానసికంగా కుంగిపోయారని తెలిపారు. కోడెల మృతికి ఒకపక్క ఆయన కొడుకు బాధ్యుడు అయితే.. పరోక్షంగా చంద్రబాబు కారణమన్నారు. కోడెల ఆయన కుమారుడు, కూతురు వల్లే చనిపోయాడని టీడీపీ నేతలే అంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కోడెల విషయమే కాదు.. ఏ అంశంలోనూ తప్పు లేకుండా ఎవరిపై కేసులు పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ ఒప్పుకోదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment