సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన ఎన్నికల ప్రచారం కోసం ‘డూప్’ను ఉపయోగించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారుడు కపిల్ మే పదవ తేదీ మధ్యాహ్నం ట్వీట్ చేయడం అది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాజకీయ రాద్ధాంతం చెలరేగిన విషయం తెల్సిందే. గౌతమ్ గంభీర్ తన ఏసీ కారులో డ్రైవర్ పక్కన ముందు సీటులో కూర్చొని ఉండగా, ఆయన పోలికల్లో ఉన్న ఓ వ్యక్తి వెనక భాగాన వాహనంపై నిలబడి అభ్యర్థిలాగా ప్రజలకు అభివాదం చేస్తున్న ఓ ఫొటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. దానికి ఎండలో నిలబడి తన లాగా ప్రచారం చేయడానికి ఓ డూప్లికేట్‌ను చౌకీదార్ గౌతమ్ గంభీర్ అద్దెకు తీసుకున్నారంటూ కామెంట్ పెట్టారు.
‘రెండు ఓటరు కార్డులు, ఇద్దరు గౌతమ్ గంభీర్‌లు’ అంటూ ఆప్ సోషల్ మీడియా హెడ్ అంకిత్ లాల్ రీట్వీట్ చేశారు. గౌతమ్ గంభీర్‌కు రెండు ఓటరు కార్డులు ఉన్నాయంటూ ఆయనపై ఆప్ తరఫున పోటీ చేస్తున్న అతిషి మార్లెనా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. గౌతమ్ గంభీర్ తన డూప్‌గా ఉపయోగించుకున్న వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు గౌతమ్ అరోరా అంటూ ఆప్ సంయుక్త కార్యదర్శి అక్షయ్ మరాఠే మరో ట్వీట్ చేశారు. ఇందులోని వాస్తవాస్తవాలను వెతికి పట్టుకునేందుకు ‘ఆల్ట్ న్యూస్’ రంగంలోకి దిగింది.
గౌతమ్ గంభీర్‌కు డూప్‌గాప్రచారం చేసిందీ గౌతమ్ అరోరా కాదని, గౌరవ్ అరోరా అని, అతను కాంగ్రెస్ నాయకుడు కాదని, గౌతమ్ కంటే ముందు నుంచే బీజేపీలో చేరిన కార్యకర్తని, ఆయనకు, గంభీర్‌కు ఎప్పటి నుంచే పరిచయం ఉందని తేల్చింది. అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సేకరించింది. ఇద్దరికి మధ్య ముఖాల్లో కొద్ది పోలికులు తప్పా పర్సనాలిటీలో ఎక్కడా పోలికలు లేవు. అందుకని అసలు ఆ రోజున ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆ రోజున ఆయన పర్యటనను కవర్ చేసిన జర్నలిస్టులందరిని ‘ఆల్ట్ న్యూస్’ విచారించింది.
అసలు ఆ రోజు ఏం జరిగిందీ?
గౌతమ్ గంభీర్ డూప్‌ను ఉపయోగించినట్లు మొట్టమొదట ఫొటోను షేర్ చేసిందీ హిందీ న్యూస్ ఛానల్ ‘టీవీ9 భారత్ వర్ష్’ జర్నలిస్ట్ కుందన్ కుమార్. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఫొటోగ్రాఫర్ అభినవ్ సహా పేర్లు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరికొందరు స్థానిక జర్నలిస్టులను వాకబు చేయగా, ‘ఆరోజున కేవలం 15 నిమిషాలు మాత్రమే గౌతమ్ గంభీర్ వాహనం నిలిబడి ప్రజలకు అభివాదం చేశారు. ప్రజలను ఉద్దేశించి ఒక్కసారి మాత్రమే మాట్లాడారు. జనం పలుచగా ఉన్న ప్రాంతంలో ఆయన దిగిపోయి తన కారు ముందు సీట్లో కూర్చున్నారు. ఆయన వెనకాల కారులో వస్తున్న గౌరవ్ అరోరా దిగి గౌతమ్ గంభీర్ స్థానంలో కారు ఎక్కారు.
గౌతంలాగే ఆయన కూడా తెల్ల దుస్తులు ధరించారు. నెత్తిన నల్లటోపీని పెట్టుకున్నారు. అభ్యర్థిలాగే మెడలో దండలు వేసుకున్నారు. అభ్యర్థిలాగే ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. ఆయనకు చుట్టూరా ఉన్న బీజేపీ నాయకులు కూడా ఆయనే అభ్యర్థి అన్నట్లుగా ప్రవర్తించారు. కారు అద్దాలు మసక్కా ఉండడంతో కారు వెన్నంటి పక్కన నడిచే వారికి మాత్రమే అందులోని గంభీర్ కనిపిస్తారు. పైగా కారు వెన్నంటి నడుస్తున్న వారిలో ఎక్కువ మంది బీజేపీ కార్యకర్తలు, గౌతమ్ అభిమానులు. దూరం నుంచి చూసే ప్రజలు మాత్రం కారు వెనక నిలబడి ప్రచారం చేస్తోంది గౌతమ్ గంభీర్ అనే భావించారు’ వారు వివరించారు. తాను భవనంపై నుంచి ఫొటో తీస్తున్నప్పుడు లాంగ్ షాట్‌లో గౌతమ్ గంభీర్ అనుకున్నానని, క్లోజప్ షాట్ కోసం కెమేరాను జూమ్ చేయగా, గౌతమ్ కాదని తేలిందని అభినవ్ సహ తెలిపారు.
ఇదే విషయమై మీడియా గౌతమ్ గంభీర్‌ను, ఆయనకు డూప్‌గా భావించిన గౌరవ్ గౌర్‌ను మీడియా సంప్రదించగా, వారిద్దరు కూడా స్పందించేందుకు నిరాకరించారు. బీజేపీ మాత్రం స్పందించింది. ఆ రోజున ఎండ వేడికి గౌతమ్ గంభీర్‌కు కళ్లు తిరిగాయని, ఆయన 10, 15 నిమిషాలు తన కారులో విశ్రాంతి తీసుకున్నారని తూర్పు ఢిల్లీ స్థానం బీజేపీ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ బబ్బర్ క్లుప్తంగా వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment