
పట్నా : దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని తెర మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీని గద్దే దించడమే తమ లక్ష్యమని ఈ కూటమి చెప్పుకుంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రానీ పక్షంలో.. విపక్షాలన్ని కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నాయకులంతా ప్రధాని పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి దక్కకపోయినా ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు.
బుధవారం పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆజాద్.. ‘మా స్టాండ్ ఏంటో ఇప్పటికే స్పష్టం చేశాం. కాంగ్రెస్‌కు మద్దతుగా అన్ని పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పాడితే.. ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ప్రధాని పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కకపోయినా పెద్దగా బాధ పడం. ఎందుకంటే బీజేపీని గద్దే దించడమే మా ప్రధాన ధ్యేయం. అందుకోసం అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాం. మిగతా పార్టీలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుంది. ఈ అంశంలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూస్తాం’ అని ఆజాద్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బదులుగా ఆజాద్ ఇలా వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment