
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాదని, టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ నాయకులు కూడా గెలవరని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉత్తమ్ బాబా నలభై గ్యాంగ్’కు హిస్టీరియా వచ్చిందని, వారి భావ దారిద్య్రానికి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సీఎం మీద వారు మాట్లాడే మాటల్లో భాష సరిగా లేదని, ఉక్రోషం, ఈర్ష్య, ద్వేషం ఉత్తమ్‌లో కనబడుతోందని అన్నారు. సీఎం కావాలని కాంగ్రెస్ నేతలు ఒకరిపైఒకరు కత్తులు దూసుకుంటున్నారని అన్నారు.
నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల్లో మద్దతుందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు, ఎందుకు కోర్టులకు వెళ్లారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. సవాళ్లు చేసి పారిపోవటం ఉత్తరకుమారుడి నైజం అని, కేటీఆర్‌తోనూ పలుమార్లు చాలెంజ్ చేసి వెనక్కి తగ్గారని అన్నారు. తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగిస్తే పాత బస్సుల్లా అమ్ముకుంటారని తెలిసే ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారని, కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటమా అంటూ మంత్రి విమర్శించారు. సూర్యాపేట కలెక్టరేట్ భూముల విషయంలో ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు అర్ధరహితం అని ఆయన కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment