
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోమవారం భేటీ అయ్యారు. కొచ్చిలో సీఎంతో భేటీ అయిన కమల్ పలు అంశాలపై చర్చించారు. కోయంబత్తూర్‌లో జూన్ మొదటి వారంలో తాను నిర్వహిస్తున్న ర్యాలీకి రావాల్సిందిగా విజయన్‌ను కమల్ కోరారు. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులపై, కర్ణాటక రాజకీయ పరిణామాలపై విజయన్‌తో చర్చించారు.
కర్ణాటకలో ఫాసిస్ట్ చేతుల నుంచి ప్రజాస్వామ్యం గెలిచిందని కమల్ వ్యాఖ్యానించారు. కేరళలో ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. తమిళనాడు విద్యార్ధులను నీట్ పరీక్ష కోసం కేరళలో అనుమతించినందుకు విజయన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం కొచ్చిలోని బోల్గటి ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో వీరిరువురు పాల్గొన్నారు.