విజయేంద్ర, యతీంద్ర
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అగ్రనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్)లు టిక్కెట్ల పంపిణీపై కసరత్తును తీవ్రతరం చేశాయి. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు.
సిద్ధరామయ్య కొడుకు X యడ్యూరప్ప కొడుకు ?
మైసూర్ జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఇక్కడి నుంచే పోటీచేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తన కుమారుడికి మార్గం సుగమం చేయడానికే సిద్దరామయ్య ఈ సారి వరుణకు బదులుగా, పొరుగునే ఉన్న చాముండేశ్వరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
బీజేపీ కూడా వరుణ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పోటీకి దింపాలని భావిస్తోంది. విజయేంద్ర అయితేనే యతీంద్రకు గట్టి పోటీ ఇవ్వగలడని భావిస్తోంది. పైగా ఆ నియోజకవర్గంలో లింగాయత్‌ల జనాభా ఎక్కువ. ఇప్పటికే విజయేంద్ర వరుణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వంశం పేరు చెప్పుకొని బీజేపీ నుంచి ఎవరూ టికెట్ ఆశించలేరంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది.
టిక్కెట్లకు పోటాపోటీ..
మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో తమ పిల్లలకు టిక్కెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం సౌమ్య బెంగుళూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు.
న్యాయశాఖమంత్రి టీబీ జయచంద్ర కుమారుడు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఎన్ రాజన్న కుమారుడు రాజేంద్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ ఆల్వాలు టిక్కెట్ల రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత పోటీ లేకపోయినా బీజేపీ నేతలు కూడా వారసుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ నేత పరిమళ నాగప్ప తన కుమారుడు ప్రీతమ్‌కు హనూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
జేడీ(ఎస్) నుంచి దేవెగౌడ కుటుంబమంతా!
జేడీ (ఎస్)లో వారసులకు కొదవే లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవలు ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దేవెగౌడ కొడుకు హెచ్‌డీ కుమారస్వామి, ఆయన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణలు మాత్రమే కాదు వారి భార్యలు అనిత కుమారస్వామి, భవానీ కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. రేవణ్ణ తన కొడుకు ప్రజ్వల్‌ను ఈసారి ఎన్నికల బరిలో దించబోతుండడంతో, కుమారస్వామి తన కుమారుడు, నటుడైన నిఖిల్‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఎక్కడ చూసినా వారసుల సందడే కనిపించబోతుంది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment