సూరీ.. ప్రజలను మోసం చేయొద్దు | Kethireddy Venkatramireddy Presentation On Apartment Scheme | Sakshi
Sakshi News home page

సూరీ.. ప్రజలను మోసం చేయొద్దు

Published Tue, Sep 4 2018 11:36 AM | Last Updated on Tue, Sep 4 2018 11:36 AM

Kethireddy Venkatramireddy Presentation On Apartment Scheme - Sakshi

పవర్‌పాయింట్‌ ద్వారా అధికారపార్టీ అవినీతి వివరిస్తున్న కేతిరెడ్డి

ధర్మవరం: ‘‘చేనేతలు అధికంగా జీవిస్తున్న ధర్మవరం పట్టణానికి అపార్టుమెంట్లు ఎందుకూ పనికి రావు. కేవలం వరదాపురం సూరి కంకర కట్టబెట్టేందుకు, చినబాబు కమీషన్లు దండుకునేందుకే వీటిని పేద ప్రజల మీద రుద్దుతున్నారు.’’ అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో అపార్టుమెంటుకు అయ్యే ఖర్చు, పక్కా ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు మధ్య తేడాను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విలేకరులకు వివరించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న అపార్టుమెంట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు లబ్ధిదారుడు బ్యాంకు నుంచి తీసుకునే రుణం కలిపి మూడు కేటగిరీల్లో వరుసగా రూ.5.98 లక్షలు, రూ.6.83, రూ.7.68లక్షలుగా ఉందన్నారు. ప్రతి నెలా వినియోగదారుడు రూ.4వేల చొప్పున 20 సంవత్సరాలు ఆ మొత్తాన్ని చెల్లించాలన్నారు.

ధర్మవరం పట్టణంలో 8,832 మందికి అపార్టుమెంట్లు మంజూరయ్యాయని, ఇందుకు రూ.529 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ఇదే 8,832 మందికి తలా రెండు సెంట్ల భూమి చొప్పున, మున్సిపల్‌ నిబంధనల ప్రకారం లేఅవుట్లు వేసి ప్లాట్లు మంజూరు చేసేందుకు 232 ఎకరాల భూమి సరిపోతుందన్నారు. ఆ భూమిని కొనుగోలు చేసేందుకు రైతుకు రూ.10లక్షలు చొప్పున ఎకరానికి చెల్లించినా రూ.232కోట్లు అవుతుందన్నారు. ఇక ఇంటికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న విధంగానే రూ.2.50లక్షల చొప్పున 8,832 మందికి అన్ని సౌకర్యాలతో ఇళ్లు కట్టించేందుకు రూ.220 కోట్లు సరిపోతుందన్నారు. అపార్టుమెంట్ల నిర్మాణం పెద్ద స్కాం అన్నారు. అందుకోసం కేటాయించే మొత్తాన్ని మాకిస్తే రైతులతో పాటు చేనేత కార్మికులు మగ్గాలు వేసుకునేందుకు వీలుగా పక్కా ఇళ్లు నిర్మించి చూపుతామని సవాల్‌ విసిరారు.

నాలుగేళ్లుగా ఆ ప్రేమ ఏమైంది..?
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని, ఆ కులానికి అన్ని ఎకరాలు, ఈ సంఘానికి ఇన్ని ఎకరాలు ఇస్తామనే హామీలు ఇస్తున్నారని, ఆ ప్రేమ నాలుగేళ్లు ఏమైందని కేతిరెడ్డి ప్రశ్నించారు. 734 ఎకరాల భూమికి ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసిందని, ఆ మొత్తంతో రైతుల భూమిని ఎలా కొంటారో చెప్పాలన్నారు. అదే మొత్తం సూరి తీసుకొని, అందులో సగం భూమిని ఇచ్చినా చాలని సవాల్‌ విసిరారు. రైతులు ఏళ్ల తరబడి నమ్ముకున్న భూములను పావలాకు, అర్ధకు స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కంకర అమ్మడం, కమీషన్లు దండుకోవడం అభివృద్ధి ఎలా అవుతుందన్నారు. అభివృద్ధిని తాము ఏనాడూ అడ్డుకోలేదని.. టీడీపీ నాయకుల కమీషన్లు, దందాలను మాత్రమే అడ్డుకున్నామనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement