
రైతులను ఆదుకోలేమని ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతులను ఆదుకుంటున్నామని పదే పదే చెప్పుకుంటున్నారని, మరి అలాంటప్పుడు ఇంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా సభలో రైతు సమస్యలపై చర్చ జరిపారని విమర్శించారు. తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరూపించుకుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులతో పనులు చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి పోచారం ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.