
సాక్షి, అమరావతి: దేశంలోని అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానాల పట్ల ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు, టీడీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించడం శోచనీయమని అన్నారు. పార్థసారథి శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడితే బీసీలపై దాడి అంటూ టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ నినాదం ఎత్తుకున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ తన కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారన్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి బయటకొచ్చిందని తెలిపారు. అచ్చెన్నాయుడు ఇరుక్కునే సరికి బీసీలపై కక్ష సాధింపు, దాడి అని అంటున్నారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి సొమ్మంతా చంద్రబాబు వద్దకే చేరిందని దుయ్యబట్టారు.
జగన్ సీఎం అయ్యాక రైతులకు న్యాయం
రాష్ట్రాభివృద్ధి కోసమే పరిపాలనా వికేంద్రీకరణ అని కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో పారిశ్రామిక, వ్యవసాయపరమైన అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతి రైతులను, రైతు కూలీలను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాతే రైతులకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి బయటకు వస్తోందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు వారి జీవితాల్లో నిప్పులు పోశారని ధ్వజమెత్తారు. ఒక జాతీయ పార్టీ నాయకుడికి చంద్రబాబు నుంచి రూ.400 కోట్లు పంపించారనే ఆధారాలు బయటకు వచ్చాయన్నారు. ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్ల అనినీతికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయని పార్థసారథి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment