కోనూరు సతీష్‌శర్మ, సాధినేని యామిని
సాక్షి, గుంటూరు రూరల్: రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిని విమర్శించే అర్హత సాధినేని యామిని, వేమూరి ఆనంద్ సూర్యలకు లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు కోనూరు సతీష్‌శర్మ ధ్వజమెత్తారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదన్నారు. బ్రాహ్మణ మహిళలను రాజకీయ నాయకులు గౌరవిస్తారు కాబట్టి పేరులో శర్మ అని తగిలించుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చనుకుంటోందని ఎద్దేవా చేశారు.
విమర్శలు హుందాగా ఉండాలి కానీ, బజారు మనుషులు మాట్లాడినట్లు మాట్లాడితే సమాజం హర్షించదన్నారు. చంద్రబాబు మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య తిరుమల శ్రీవారి బంగారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నారని చెప్పకనే చెప్పినట్లుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యాన్ని మంత్రులు విమర్శిస్తున్న వైనం చూస్తుంటే రూ.లక్షల కోట్ల ప్రభుత్వ అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జంగా జయరాజు, శేషం సుబ్బారావు, వడ్రానం శివ, తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment