సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి నేత కుమార్ విశ్వాస్ మరోసారి పార్టీ కన్వీనర్ గోపాల్ రాయ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో ఎమ్మెల్యే అమానుతుల్లాను లక్ష్యంగా చేసుకొన్న గోపాల్ రాయ్ ఇప్పుడు తనపై అదే విధంగా కక్షకట్టారని విమర్శించారు.
బాహుబలి-2 సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గోపాల్ రాయ్‌కు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. సినిమాలో శివగామి దేవి తనకు ఎవరైనా ఎదురుతిగితే అంతం చేయడానికి కట్టప్పను ఉసిగొల్పుతుందని, చివరకు కొడుకు బాహుబలిని కూడా చంపేయిస్తుందని, ఇప్పుడు పార్టీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉందని కుమార్ విశ్వాస్ అన్నారు. అధిస్థానానికి ఎదురు తిరిగితే తమ పార్టీ అధినేత కేజ్రీవాల్, తిరుగుబాటుదారులపై గోపాల్‌రాయ్ అనే కట్టప్పను ప్రయోగిస్తారని దుయ్యబట్టారు.
పార్టీలోని చాలామంది కార్యకర్తలు తనని రాజ్యసభ సభ్యుడిగా చూడాలనుకున్నారని, ఈ విషయంపై పార్టీలో ఎన్నిక కూడా నిర్వహించాలని సూచించానని అన్నారు. కానీ తన మాటను పార్టీ పక్కన పడేసిందని, కావాలనే వ్యాపార వేత్త సుశీల్ గుప్తా, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్డీ గుప్తా, పార్టీ నేత సంజయ్ సింగ్‌లను పార్టీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఇది పార్టీలో నిజాలు మాట్లాడినందుకు దక్కిన ఫలితం అన్నారు. ఇది తన బలిదానంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
అయితే దీనిపై పార్టీ సీనియర్ నేత స్పందించారు. గోపాల్ రాయ్‌పై కుమార్ విశ్వాస్ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ను పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసిందని అన్నారు. ఒకవేళ పార్టీ కుమార్‌ను నిర్లక్ష్యం చేస్తే రాజస్తాన్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా విశ్వాస్‌ను ఎందుకు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. ఇక రాజ్యసభ ఎన్నికల విషయానికి వస్తే శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. 8 వరకూ నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంది. జనవరి 16న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment