కేసీఆర్‌.. ఓ నయా నవాబ్‌! | Kushboo fires on TRS and BJP | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌.. ఓ నయా నవాబ్‌!

Published Wed, Nov 21 2018 3:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kushboo fires on TRS and BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖరీదైన కార్లు, రూ.300 కోట్ల విలాసవంతమైన బంగ్లా, రాజభోగాలతో ఓ నయా నవాబ్‌ను తలపిస్తున్నారని ధ్వజమెత్తారు. సచివాలయానికి రాకుండా ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌ల్లో కాలక్షేపం చేసే ఏకైక సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని కేసీఆర్‌.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల మధ్యనే ఉంటాననడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. రూ.మూడు వందల కోట్ల విలువైన బంగ్లా కట్టుకున్న కేసీఆర్‌కు పాపం సొంత కారులేదట అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సీఎం కాదని.. కమీషన్‌ మ్యాన్‌ అని అభివర్ణించారు. కమీషన్ల కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నది బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల్లో ఆరు శాతం కమీషన్‌ కాజేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎన్‌.శారద, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో అధర్మ పాలన కొనసాగుతోందని, ప్రతిపక్షం అంటే కేసీఆర్‌కు కనీస గౌరవం లేదన్నారు. తెలంగాణ అవినీతిలో రెండు, నిరుద్యోగంలో మూడోస్థానంలో ఉందని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో చెప్పిందొక్కటీ పూర్తి చేయలేదని, దళిత సీఎం హామీని డస్ట్‌బిన్‌లో వేశారని దుయ్యబట్టారు.  

మహిళా సాధికారతేదీ..?  
మహిళా సాధికారత గురించి మాట్లాడే కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్లు ఎందుకు కేటాయించలేదని ఖుష్బూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ 11 సీట్లిస్తే, టీఆర్‌ఎస్‌ కేవలం 4 మాత్రమే ఇచ్చిందన్నారు. నాలుగేళ్లలో ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించలేదని, రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. 14 మంది ఎంపీల్లో ఒకే ఒక మహిళ ఉన్నారని, ఆమె కూడా కేసీఆర్‌ కూతురేనన్నారు. రాష్ట్రంలో మహిళలంటే కేసీఆర్‌ కూతురు ఒక్కరేనా? అని ప్రశ్నించారు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా మహిళను పెట్టలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్‌దని దుయ్యబట్టారు. కేసీఆర్‌ది మహిళావ్యతిరేక ప్రభుత్వమని, ఆయన పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై 18 శాతం మేర నేరాలు పెరిగిపోయాయన్నారు. బతుకమ్మ చీరల కొనుగోలులో రూ.220 కోట్ల కుంభకోణం జరిగిందని ఆమె ఆరోపించారు. కల్యాణలక్ష్మీ పథకం కూడా కేవలం టీఆర్‌ఎస్‌ సంబంధిత వర్గాలకే అందుతోందని, ఈ పథకానికి ఇచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించలేదని, ఎక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వం బోగస్‌ ఎన్‌కౌంటర్లు చేస్తోందని, చిత్రహింసలకు గురి చేసి యాసిడ్‌ పోసి చంపేసిన శ్రుతి ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  

ఓవైసీ స్థాయి రూ.25 లక్షలేనా..  
మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ స్థాయి రూ.25 లక్షలేనా అని ఖుష్బూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఒకరు తన నియోజకవర్గంలో మజ్లిస్‌సభ జరగకుండా ఉండేందుకు మధ్యవర్తి ద్వారా రూ.25 లక్షలు ఆఫర్‌ చేశారని అసద్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. అసదుద్దీన్‌ తన స్థాయి తక్కువగా దిగజార్చుకున్నారని, నిజంగా ఆఫర్‌ ఇస్తే నిరూపించాలని సవాల్‌ చేశారు. అప్పుడు పార్టీ పరంగా చర్యలు  తీసుకోవడంపై ఆలోచిస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్‌ రద్దు చేసిన పాత పథకాలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హస్తం, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రేమలో ఉన్నాయి..
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ఖుష్బూ దుయ్యబట్టారు. ఒకదానికొకటి సహకరించుకుంటూ ప్రేమలో ఉన్నాయన్నారు. కేసీఆర్, మోదీ రిబ్బన్‌ కటింగ్స్‌ చేసే సీఎం, పీఎంలుగా వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. గిరిజనుల భూములను కమీషన్‌లతో అమ్ముకున్నారని, గిరిజనులను చిత్రహింసలు పెట్టిన చరిత్ర కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు. ఇండ్లు ఇస్తానని జర్నలిస్ట్‌లను కూడా కేసీఆర్‌ మోసం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ జీరో కావడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement