లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపు, కాంగ్రెస్ సహా మిగిలిన పక్షాలన్నీ ఒకవైపుగా పోరు నడుస్తోంది. కానీ బిహార్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రాష్ట్రంలో ఫలితాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరచూ మిత్రుల్ని మార్చే రాజకీయాలకు ఒక రిఫరెండంగా భావిస్తున్నారు. సుపరిపాలనకు పెట్టింది పేరైన నితీశ్ గత ఆరేళ్లలో ప్రతీ ఎన్నికలకి కూటములు మారడం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ? ఒకప్పుడు బిహార్లో మోదీని అడుగు పెట్టనివ్వనన్న నితీశ్ ఇప్పుడు బీజేపీకి అధికారాన్ని అప్పజెప్పేందుకు చేస్తున్న కృషి ఫలితాన్నిస్తుందా ? సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది.
తొలి నుంచీ రాజకీయాలూ, కులం కలగలిసి ఉన్న రాష్ట్రం బిహార్. ఇటు రాజకీయాల్లోనూ, అటు సామాజిక కోణంలోనూ మిగిలిన రాష్ట్రాలకు పూర్తి భిన్నత్వం గల బిహార్ ఎన్నికల్లో ఈ సారి రాజకీయానుభవం, ప్రజల మద్దతు కలిగిన ఆర్జేడీ నేత లాలూ లేకపోవడం కూడా ప్రత్యేకమే. ఓ పక్క అపర రాజకీయ దురంధరుడూ, చమత్కారీ లేని లోటుతో పాటు, రాష్ట్ర సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌పై బీజేపీ పూర్తిగా నమ్మకం ఉంచడం మరో ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) చేతులు కలిపి చెరో 17 సీట్ల నుంచి పోటీ పడుతున్నారు.
శత్రువులు మిత్రులైన వేళ
భారతీయ జనతా పార్టీ 2013లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నితీశ్‌కుమార్ జీర్ణించుకోలేకపోయారు. ఏనాటిౖకైనా ప్రధాన మంత్రి కావాలని కలలు కన్న ఆయన బీజేపీతో 17ఏళ్ల బంధాన్ని తెంపేసుకున్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీపై విమర్శల దాడిచేశారు. ఆయనను బిహార్ గడ్డపై అడుగుపెట్టనివ్వనని ప్రతినబూనారు. మాటల గారడీ చేస్తారంటూ విమర్శించారు. మోదీ కూడా మోసం చేయడం నితీశ్ డీఎన్‌ఏలోనే ఉందని ఎదురుదాడి చేశారు.
గత ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకున్నారు. కానీ మోదీ హవా ముందు నితీశ్ నిలబడలేకపోయారు. నితీశ్ పార్టీ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకప్పుడు శత్రువుగా చూసిన లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపి నెగ్గారు. సీఎం పదవిని కూడా అందుకున్నారు. మళ్లీ నాలుగేళ్లు తిరిగిందో లేదో లాలూకి హ్యాండిచ్చి తిరిగి బద్ధశత్రువులా చూసిన మోదీతో చేతులు కలిపారు. మోదీ అధికారంలోకి వస్తేనే దేశం భద్రంగా ఉంటుందని, బిహార్ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు.
నితీష్ మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా ?
నితీశ్ ఎంత పరిపాలనాదక్షుడైనప్పటికీ ఇలా కూటములు మారడం వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు హిందూస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) చీఫ్ జితన్ రామ్ మాంఝీ ‘‘బహుశా ఇదే నితీశ్‌కి ఆఖరి ఎన్నికలు. అధికారంలో కొనసాగడానికి ఆయన ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు‘‘అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ కంటే జేడీ(యూ)కి తక్కువ సీట్లు వచ్చాయని, లాలూ కుమారుడు ఎక్కడ సీఎం అవుతారోనని లోలోపల ఆయనకి భయం ఉందని ఆరోపించారు. కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా నితీష్ గోడదూకుడు రాజకీయాలను తప్పుపడుతున్నారు. ‘‘నితీష్ కుమార్‌లో ఈ మార్పు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అన్నిటికన్నా ముఖ్యంగా నితీ‹Ô నోటి వెంట మోదీ జపం విస్మయానికి గురిచేస్తోంది’’అని సీమాంచల్, కోశి ప్రాంతంలో వరద బాధితుల సమస్యలపై పనిచేస్తోన్న మహేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు జేడీ (యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి నితీశ్, మోదీ కాంబినేషన్‌కి తిరుగులేదని అభిప్రాయపడ్డారు. ‘‘మా రెండు పార్టీల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. లెక్కలు కూడా పక్కాగా వేశాం.గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ), ఎల్‌జేపీ ఓటు షేర్‌ని బట్టి అంచనాలు వేసుకుంటే ఈ సారి మా కూటమి 40కి 38 సీట్లు గెలుచుకుంటుంది‘‘అని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నేతలు కూడా ఈ ఎన్నికలు మోదీ, నితీశ్ పరిపాలనకు రిఫరెండంగానే భావిస్తున్నారు. ‘‘ఎన్డీయేకి నితీ‹శ్ కుమారే ప్రధానమనీ, ఇప్పటికీ నితీశ్ బ్రాండ్ ఇక్కడ పనిచేస్తోందనీ జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ అంటున్నారు.
మహిళా ఓటర్లే నితీశ్‌కి అండదండ !
బిహార్‌లో ఇప్పటివరకు 14 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గయ మినహా మిగతా అన్ని చోట్లా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వచ్చి ఓట్లు వేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగా మెరుగు పడడం, అమల్లో లోపాలు ఉన్నప్పటికీ మద్యపానంపై నిషేధం విధించడంతో మహిళలంతా నితీశ్‌వైపే ఉంటారని అంచనాలున్నాయి. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న వ్యక్తిగత కరిష్మాతో నితీశ్‌కుమార్‌కి ఉన్న క్లీన్ ఇమేజ్ తోడుకావడంతో వెనుకబడిన కులాలన్నీ ఎన్డీయేకే మద్దతు పలుకుతున్నాయి. అందుకే మహిళలంతా కులాలకు అతీతంగా ఈ సారి మోదీ, నితీశ్ ద్వయానికే ఓట్లు వేసినట్టుగా అంచనాలున్నాయి. మరోసారి రాష్ట్రంలో ఎన్డీయే స్వీప్‌చేయడం ఖాయం‘‘అని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సైబాల్ గుప్తా అభిప్రాయపడ్డారు.
మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు అనుకూలంగా లేవా ?
ఈ సారి ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు ఏమంత అనుకూలంగా కనిపించడం లేదు. సీట్ల పంపకం ఆ కూటమిలో సంక్షోభాన్నే నింపింది. కూటమిలో ఆర్‌ఎస్‌ఎల్‌పీ, హెచ్‌ఏఎం వంటి చిన్నా చితకా పార్టీలు సంతృప్తిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, ఆర్‌జేడీ కత్తులు దూసుకున్నాయి. చివరికి ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నాయి. ఆర్‌జేడీ 20 స్థానాల్లో పోటీ చేస్తుంటే, క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు కట్టబెట్టింది. మిగిలిన 11 సీట్లు చిన్నపార్టీలు పంచుకున్నాయి. ఇవన్నీ మహాగఠ్‌బంధన్ కొంప ముంచుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment