ఇనుప కంచెలను దాటుకుని వెళ్తాం | Mallu Bhatti Vikramarka Slams TRS Over Not Giving Permission To Meet OU Students | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 11 2018 3:33 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

Mallu Bhatti Vikramarka Slams TRS Over Not Giving Permission To Meet OU Students - Sakshi

ఓయూలో పర్యటనకు అనుమతి ఇవ్వడంలేదు కానీ భవిష్యత్తులో మాత్రం అడ్డుకోలేరు..

సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం నిషేధిత ప్రాంతం కాదు.. అందులో ఉన్నవారు తీవ్రవాదులు కారు. ఇనుప కంచెలు దాటుకుని వెళ్లి మరి వారిని కలుస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వారు.. దేశానికి దిశానిర్దేశం చేసే అత్యద్భుత మానవ వనరులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓయూలో విద్యార్థులను కలుస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం శోచనీయం అన్నారు. రాహుల్‌ విద్యార్ధులను కలుస్తానన్నది వారితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకునేందుకే అని తెలిపారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుమతివ్వలేదని, ఇలా చేయడం విద్యార్థుల ఆత్మాభిమానాన్ని కించపరచడమేనని ఆరోపించారు. ఇప్పుడు ఓయూలో పర్యటనకు అనుమతి ఇవ్వడంలేదు కానీ భవిష్యత్తులో మాత్రం తమను అడ్డుకోలేరని తెలిపారు. పోలీస్ బలగాలను, ఇనుప కంచెలను దాటుకుని వెళ్లి మరి విద్యార్థులను కలుస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు.

మహిళల సమస్యలపై ప్రధాన చర్చ
తెలంగాణ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ పలు సమస్యలపై మాట్లాడతారని భట్టి తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తారన్నారు. తొలుత రాహుల్ గాంధీ అసెంబ్లీకి ఎదురుగా ఉన్న అమరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్థి, నిరుద్యోగుల గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.  సోనియా గాంధీ త్యాగాలకు సిద్ధపడి తెలంగాణ ఇచ్చింది ఇక్కడి ప్రజల కోసమే కానీ కేసీఆర్ కుటుంబం కోసం కాదని గుర్తు చేశారు. కేసీఆర్‌ పాలనలో మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement