
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ లోక్‌సభ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీకి బదులు పొరపాటున ఈవీఎంలో బీజేపీ గుర్తుకు ఓటు వేయడంతో ఓ దళితుడు తన వేలిని నరికేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు లోక్‌సభ స్థానాలకు రెండోదఫా పోలింగ్ గురువారం జరిగిన సంగతి తెలిసిందే. శిఖర్‌పుర ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (25) ఈ ఘటనకు పాల్పడ్డాడు.
పొరపాటున బీజేపీ గుర్తుకు ఓటేయడంతో కోడవలిని ఉపయోగించి తన చేతి వేలిని పవన్ నరికేసుకున్నాడు. వేలిని నరికేసుకున్న తర్వాత పొరపాటున బీజేపీకి ఓటేశానంటూ అతను విచారం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటేయాలని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన పవన్.. పొరపాటున బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ భోలా సింగ్‌కు ఓటేశాడని, జరిగిన పొరపాటున తెలుసుకొని తనపై తానే ఆవేశానికి లోనై.. వేలిని నరికేసుకున్నాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.