
అధిష్టాన పెద్దలు సనత్‌నగర్ సీటు నాకే కేటాయిస్తానని చెప్పారు కానీ...
సాక్షి, హైదరాబాద్: తనకు సీటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. సనత్‌నగర్ టిక్కెట్‌ను టీడీపీకి కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
తమ పార్టీ నాయకులు కావాలనే సనత్‌నగర్ స్థానానికి టీడీపీకి వదిలేశారని ఆరోపించారు. ఎల్బీ నగర్ సీటు కోసం తన స్థానాన్ని విడిచిపెట్టారని వెల్లడించారు. అధిష్టాన పెద్దలు సనత్‌నగర్ సీటు తనకే కేటాయిస్తున్నారని తేల్చి చెప్పారని, అయినప్పటికీ సీటు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి తాను గెలవనని వాదించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తనకు సీటు ఇవ్వకుండా అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని వాపోయారు. ఇలాంటి నిర్ణయాలతో పార్టీ తీవ్ర నష్టం పోవడం ఖాయమన్నారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోనని స్పష్టం చేశారు.
ఢిల్లీలో జైపాల్ రెడ్డి మంత్రాంగం
దేవరకద్ర, నారాయణపేట స్థానాల్లో బిసిలకే అవకాశం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పట్టుబట్టారు. ఇద్దరికి కుదరకపోతే కనీసం ఒక్కరికైనా ఇవ్వాలని సూచించారు. జైపాల్ రెడ్డి ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అధిష్ఠానం అంగీకరించినట్టు సమాచారం.