‘చంద్రబాబు అనవసరంగా రెచ్చగొడుతున్నారు’ | Mekathoti sucharitha Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అనవసరంగా రెచ్చగొడుతున్నారు’

Published Wed, Jan 8 2020 10:02 PM | Last Updated on Wed, Jan 8 2020 10:23 PM

Mekathoti sucharitha Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, గుంటూరు : రాజధాని తరలిపోతుదంటూ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని చంద్రబాబు నాయుడిపై హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. రాజధాని ఎక్కడికి పోవడంలేదని, కేవలం వికేంద్రీకరణ మాత్రమే జరగుతుందన్నారు. బుధావారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలిపోతుదంటూ టీడీపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో అనారోగ్యంతో చనిపోయినవారిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అభివృద్ధి చేసిన భూమిని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. 

ఏ ప్రాంతానికీ అన్యాయం చేసే ఆలోచన లేదు
‘చంద్రబాబు అసాంఘిక శక్తి. హింస లేనిదే బతకలేరు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైంది. ఈరోజు విజయవాడలో, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించి తన బినామీ భూముల రేట్లు తగ్గకుండా కాపాడుకునేందుకు తెగించారు. నిజానికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న ప్రతిపాదనల్లో విజయవాడ తన ప్రాధాన్యతను ఎప్పటికీ నిలబెట్టుకునేలా లెజిస్లేటివ్‌ రాజధాని ఇక్కడే ఉంటుందని అందరికీ అర్థం అయ్యింది. అభివృద్ధిని అందరికీ పంచకపోతే తిరుగుబాటు లేదా ఉద్యమాలు వస్తాయని శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీలు స్పష్టంచేశాయి. ఇప్పుడు చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని సరిదిద్దేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏ ప్రాంతానికీ అన్యాయం చేసే ఆలోచనే లేదు. రైతులకు అన్యాయం చేసే ఆలోచన అంతకన్నా లేదు. అయినా చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగానే శాంతి భద్రతల సమస్యను సృష్టించి, తన పార్టీని బతికించుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం శవరాజకీయాలు చేస్తున్నారు.

ఉద్దేశ పూర్వకంగా సమస్యలు సృష్టిస్తున్నారు
ఇవాళ బెంజ్‌ సర్కిల్‌ వద్ద పక్కా పథకంతో ముందుగానే తన మనుషులను పిలిపించుకుని లా అండ్‌ ఆర్డర్‌ సమస్యను ఉద్దేశ పూర్వంగా సృష్టించారు. ముందుగానే తన అనుకూల మీడియాను పిలిపించుకుని, ఒక డ్రామా నడిపారు. విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే విజయవాడ ప్రజలకు మేలు జరుగుతుందా?  విజయవాడలో శాంతి భద్రతలు ఇలా ఉన్నాయంటే.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వారికి ఎలాంటి సంకేతం పోతుంది? సచివాలయానికి, అసెంబ్లీకి, హైకోర్టుకు వెళ్లే దారిని వెళ్లకుండా రోడ్డుమీద కూర్చుని అడ్డగిస్తున్నారంటే.. 13 జిల్లాల్లోని ప్రజలకు ఏం అర్థం అవుతుంది. చంద్రబాబు ముఠా సామ్రాజ్యంగా ఈప్రాంతాన్ని నడిపేందుకే ఈ ఉద్యమం చేస్తున్నాడని అర్థం కావడంలేదా? పోలీసుల సహనాన్ని ఎంత పరీక్షించినా.. వారు మౌనంగానే ఉన్నారు. ప్రశాంతగా వారు విధులు నిర్వర్తించారు. చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రజలెవ్వరూ రెచ్చిపోలేదు, రెచ్చపోరుకూడా. 

బాబు ఒక ముఠానాయకుడినని నిరూపించుకున్నారు
నిన్న మా ఇద్దరి ఎమ్మెల్యేల మీద హత్యాయత్నం చేసినా మా ప్రభుత్వం సంయమనం పాటించింది. ఇదంతా చంద్రబాబు తన చేతకాని తనంతో చేస్తున్నాడని కనపడుతూనే ఉన్నా ప్రజా బలం లేని చంద్రబాబును చూసి రాష్ట్రం అంతా ఛీ కొడుతోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అనుభవం.. పక్కకుపోయి చంద్రబాబు నిజస్వరూపం ఒక అసాంఘిశక్తి రూపంలో, హింసావాది రూపంలో బట్టబయలు అయ్యింది. తనను జాతీయ నాయకుడిగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు తాను ఒక ముఠానాయకుడినేనని నిరూపించుకున్నారు. చివరగా ఒక మాట చెప్పాలి. భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాల్లో ఏనాడూ కనీవినీ ఎరుగని ఒక అద్భుతమైన పథకానికి, అమ్మ ఒడి రూపంలో ఒక చారిత్రక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్‌ వేదిక కాబోతుందన్న అంశాన్ని డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు ఇంతకు తెగించాడా అని అందరూ ఆలోచిస్తారు. తన పాదయాత్ర ముగిసిన జనవరి 9 నే దాదాపు 43 లక్షల మందికి తల్లులకు, వారి పిల్లల్ని చదవించుకునేందుకు వీలుగా రూ.6400 కోట్లకుపైగా డబ్బును వారి ఖాతాల్లో వేయబోతున్న ఇంత పెద్ద సందర్భాన్ని చంద్రబాబు డైవర్ట్‌ చేయడానికి రోడ్డుమీద కూర్చున్నాడు. తన పచ్చమీడియాను పురిగొల్పుతున్నారు’ అని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement