![Minister Vellampalli Srinivasa Rao Inaugurated The Solar Power Generation Plant In West Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/28/Vellampalli-Srinivasa-Rao.jpg.webp?itok=9Kcsquv4)
సాక్షి, పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల ఆర్య వైశ్య కళ్యాణ మండపం ట్రస్ట్ వాసవి మాతకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ జనరేషన్ ప్లాంటును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే వైశ్య కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టనున్నారని ఆయన వెల్లడించారు. రాజధానిని గొప్పగా నిర్మించామని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి సచివాలయం, హైకోర్టులలో వర్షాలు పడితే నీరు వచ్చే పరిస్థితి ఉందని మంత్రి విమర్శించారు. అలాగే రాష్ట్ర విభజన అనంతరం అయిదేళ్లుగా గత ప్రభుత్వం పోట్టి శ్రీరాములు జయంతిని నిర్విర్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు.
ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా క్రిష్టియానిటి వస్తుందంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, తిరుపతి కొండపై శిలువ ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇంటిలో పని చేసే పిల్లలను సైతం ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియానని సీఎం జగన్ ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కులం, పార్టీ, మతాలకు అతీతంగా పాలన చేయాలంటూ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక ఆర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment