సాక్షి, తాడిపత్రి: ‘‘జేసీ బ్రదర్స్...మీదీ ఓ బతుకేనా...ఊరుమీద పడి దోచుకోవడం తప్ప... అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ఏనాడైనా పట్టించుకున్నారా..? ఆలయాలను అడ్డుపెట్టుకుని దోచుకున్నారు. ట్రాన్స్‌పోర్టు వ్యవహారంలో నకిలీ పత్రాలను సృష్టించి డ్రైవర్లకు అందాల్సిన బీమా సొమ్మును కూడా స్వాహా చేస్తున్నారు. చివరకు చికెన్ సెంటర్ల వ్యాపారులతో కూడా కమీషన్లు తీసుకున్న సంస్కృతి మీ చరిత్ర జిల్లా ప్రజలందరికీ తెలుసు...మీరా నాపై ఆరోపణలు చేసేది. నిజంగా దమ్ముంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం...మీరు సిద్ధమా..?’’ అని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ సోదరులకు సవాల్ విసిరారు.
ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని...నాడు చేసిన పాపాలే నేడు జేసీ సోదరులను వెంటాడుతున్నాయని, వారికి కేసుల భయం పట్టుకుందన్నారు. జేసీ సోదరుల 40 ఏళ్ల దుర్మార్గపు పాలనకు ప్రజలు ముగింపు పలికారని, అందుకే వారికి మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పినా జేసీ సోదరుల తీరులో ఇంకా మార్పురాలేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.
మీ ఆరాచకాలు అప్పుడే మరిచారా..?
జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడు పోలీసులను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకున్న విషయాన్ని జిల్లా ప్రజలు ఇంకా మరచిపోలేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షపార్టీ నేతలపై దొమ్మీ కేసులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అయితే అప్పట్లో పోలీసులు వాస్తవాలను తెలుసుకుని అసలైన నిందితులను అరెస్టు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గంలోని తన అనుచరులను వెంటబెట్టుకొని ప్రబోధానంద ఆశ్రమంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దాడి చేశాడని, దాడిలో పాల్గొన్న వారి పేర్లను మాజీ ఎంపీ జేసీనే స్వయంగా పోలీసులకు అందజేసి విచారణకు సహకరిస్తే చార్జీ షీటు వేస్తారన్నారు. అంతేగానీ పోలీసులను బ్లాక్‌మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు.
ప్రబోధానంద ఆశ్రమం ఘటనలో అరెస్టులు ఆపకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యనించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సామాన్యునికి ఓ న్యాయం... జేసీ కుటుంబానికి మరో న్యాయమా అని పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఉనికి కోల్పోతున్నామనే భయంతోనే ఇలా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఇలాగే పోలీసులను బ్లాక్‌మెయిల్ చేస్తే తాను కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటి వద్ద నిరాహార దీక్షకు పూనుకుంటానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి హెచ్చరించారు.
బహిరంగ చర్చకు సిద్ధమా..?
తనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే జేసీ నివాసం వద్దకే చర్చకు వస్తానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో పోటీ చేసిన తమ కుమారులను ఎక్కడో ఉంచి ఇక్కడ అమాయకపు ప్రజలతో జేసీ సోదరులు చెలగాటమాడుతున్నారన్నారు. వారి కుమారులైతే క్షేమంగా ఉండాలి గానీ... నియోజకవర్గ ప్రజలు మాత్రం కక్షలు కార్పణ్యాలతో కొట్టుకు చావాలా..? అని ప్రశ్నించారు. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా నిద్రపోతున్నారన్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లోని ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించేందుకు జేసీ సోదరులు కుట్రపన్నుతున్నారని, ఎవరూ కుట్రలకు బలికావద్దని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment