న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దుచేసే విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(ఎంఎస్‌డీ) వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ ఏడాది జూన్ నెలలోనే అందుకోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యంను జమ్మూకశ్మీర్ ముఖ్యకార్యదర్శి(సీఎస్)గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ప్రధాని కార్యాలయం(పీఎంవో)లో సంయుక్త కార్యదర్శిగా ఉన్నసమయంలో సుబ్రహ్మణ్యం పనితనాన్ని గుర్తించిన మోదీ ఈ కీలక బాధ్యతను ఆయన భుజస్కందాలపై పెట్టారు. అలాగే ఈ మొత్తం ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసే బాధ్యతను అమిత్‌షాకు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన షా.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. అదే సమయంలో కశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధ్యయనం చేసే బాధ్యతను దోవల్‌కు అప్పగించారు. ఆర్టికల్ 370ను రద్దుచేస్తే తలెత్తే న్యాయపరమైన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ప్రసాద్ నేతృత్వంలోని కోర్ టీమ్‌తో చర్చలు జరిపారు. ఈ బృందంలో న్యాయశాఖ కార్యదర్శి అలోక్ శ్రీవాత్సవ్, హోంశాఖ అదనపు కార్యదర్శి ఆర్.ఎస్.వర్మ, అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబా తదితరులు సభ్యులుగా ఉన్నారు.
మోదీ ఆదేశాలతో రంగంలోకి దిగిన హోంమంత్రి అమిత్ షా నాగ్‌పూర్‌లోని బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లారు. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయబోతున్న విషయాన్ని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, సంస్థ ప్రధాన కార్యదర్శి భయ్యాజీలకు వివరించారు. అనంతరం అమిత్ షా.. జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్‌తో పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారు. ఒకవేళ ఆర్టికల్ 370ని రద్దుచేస్తే కశ్మీర్‌లో తలెత్తే పరిణామాలతో పాటు భద్రతను సమీక్షించాలని దోవల్‌కు సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన దోవల్.. శ్రీనగర్‌లో 3 రోజులు పర్యటించారు. ఆర్మీ, పోలీస్, నిఘా సంస్థల ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఢిల్లీ చేరుకున్న దోవల్ కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేయాలని కేంద్రానికి సూచించారు. అలాగే పర్యాటకుల్ని రాష్ట్రం నుంచి ఖాళీ చేయించాలనీ, 100 కంపెనీల అదనపు బలగాలను మోహరించాలని చెప్పారు. ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్ ఫోన్ సేవలను నిలిపివేయాలని ముందుగానే నిర్ణయించారు. అదే సమయంలో కేంద్రం తీసుకోబోతున్న చర్యలకు సంబంధించి సమాచారాన్ని ముందుగానే సీఎస్ సుబ్రహ్మణ్యంకు కేంద్ర హోంశాఖ అందిస్తూ వచ్చింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలువురు నేతల్ని పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు.
ఆరెస్సెస్ ఆశీస్సులతో.. ‘షా’మాస్టర్ ప్లాన్..
ఇక రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టే విషయంలోనూ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కశ్మీర్ పునర్విభజన అంశం అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన అంశమైనందున కేంద్రం తీసుకోబోయే చర్యల విషయమై కీలక సమాచారాన్ని షా కొన్ని మీడియా సంస్థలకు అందిస్తూ వచ్చారు. అదే సమయంలో రాజ్యసభలో కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదానికి అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు అనిల్ బలూనీ, భూపేంద్ర యాదవ్‌లు తటస్థ పార్టీలు, ఇతర రాజ్యసభ సభ్యుల్ని కలిసి బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే అనర్హత వేటు భయంతో ఎస్పీ ఎంపీలు నీరజ్ శంకర్, సురేంద్ర నాగర్, సంజయ్ సేత్, కాంగ్రెస్ ఎంపీ సంజయ్ సింగ్‌లు రాజ్యసభకు గైర్హాజరయ్యారు. బిల్లుకు మద్దతిస్తానని బీఎస్పీ సభ్యుడు సతీశ్ మిశ్రా ప్రకటించారు. చివరికి రాజ్యసభలో తగిన మద్దతుందని నిర్ధారించుకున్నాకే ఈ చారిత్రాత్మక బిల్లును అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఓవైపు ఈ బిల్లుపై చర్చ సాగుతుండగానే రాష్ట్రపతి కోవింద్ ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుముందు పార్టమెంటు సమావేశాలకు హాజరుకావాలని బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీచేసింది. ఈ మొత్తం ప్రక్రియ విజయవంతంగా సాగడంపై బీజేపీ నేత ఒకరు స్పందిస్తూ..‘అమిత్ షాకు ఓటమన్నది తెలియదు. ఆయన భారత్ పాలిట సరికొత్త సర్దార్ పటేల్‌గా మారారు’అని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment