‘సాక్షి’తో మాట్లాడుతున్న నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, సూర్యకిరణ్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా మారిందని.. అందుకే బీజేపీని విడిచి కాంగ్రెస్‌లో చేరినట్టు నాగం తెలిపారు. తన తర్వాతి టార్గెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీలో తన రాకను ఎవరూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అధిష్టానం నుంచి సహాయ సహకారాలు కావాలని కోరగా, తన సహకారం ఉంటుందని రాహుల్ గాంధీ తెలిపినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, వాటన్నింటిపై పోరాడనున్నట్టు నాగం ఈ సందర్భంగా తెలిపారు.
ఎక్కడైనా పోటీకి రెడీ: సూర్యకిరణ్
రాహుల్ గాంధీ సేవ్ కానిస్టిట్యూషన్ నినాదం నచ్చడంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గద్దర్ తనయుడు సూర్యకిరణ్ తెలిపారు. కాంగ్రెస్‌లో తన చేరికకు తండ్రి ఆశీస్సులున్నాయన్నారు. ఓటు రాజకీయాలపై విశ్వాసం ఉందని, తాను మావోయిస్టు పార్టీ సభ్యుడిని కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ బరిలో దిగుతానని సూర్యకిరణ్ వెల్లడించారు.
వేములవాడ నుంచి పోటీ: ఆది శ్రీనివాస్
టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని ఆది శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేయడం లేదని, అందుకే ఆ పార్టీని వీడినట్టు శ్రీనివాస్ అన్నారు. తన సొంతగూడు కాంగ్రెస్‌లో మళ్లీ చేరానని, అధిష్టానం టికెట్ ఇస్తే వేములవాడ నుంచి పోటీ చేస్తానన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వంపై తన పోరాటం కొనసాగుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment