సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా దళితులపై కపట ప్రేమ చూపుతున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఓడిపోయే రాజ్యసభ సీటును దళితులకు కేటాయించిన బాబుది ప్రేమో, పగో అర్థం కావడం లేదన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... 2008లో గెలిచే అవకాశం ఉన్నా దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని తెలిపారు. 2016లో పుష్పరాజును సైతం మోసం చేశారన్నారు. మోతుపల్లికి గవర్నర్ పదవి ఇస్తానని మాట తప్పారని ఎద్దేవా చేశారు. గెలిచే రోజుల్లో అవకాశాలివ్వక ఓడిపోయే సమయంలో అవకాశం ఇచ్చి దళితులను బలిపశువులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచే పదవి అయితే కొడుక్కే ఇచ్చేవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చంద్రబాబు పన్నాగంతోనే నాపై దాడి: నందిగం సురేష్)
‘దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి చంద్రబాబు. ఎస్సీలను ఎప్పుడూ ఓటుబ్యాంకుగానే చూశారు. గతంలో ఎస్సీలుగా ఎవరు పుడతారు? అన్న ఆయనకు నేడు వారిపై వింత ప్రేమ పుట్టుకొచ్చింది. గెలవని సీటు కోసం మీడియా సమావేశాలు పెడుతున్నారు. దళితులను మోసం చేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సామాజిక న్యాయం అంటూ తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకున్నారు. దళితులకు గౌరవం లేని పార్టీ టీడీపీ. అవమానాలు దళితులకు.. పదవులు వారి సామాజిక వర్గానికి. టీడీపీలో దళితులు ఏం సాధించారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీరు బలిపశువులు కావద్దు. చంద్రబాబును ప్రశ్నించండి. మనస్సాక్షి, ఆత్మాభిమానాన్ని చంపుకుని టీడీపీలో ఉండలేకే డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాబుకు ఇన్నేళ్లు వచ్చినా అబద్ధాలు, మోసాలు ఆపడం లేదు. ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అని నందిగం సురేష్ పేర్కొన్నారు. (వలసల జోరు.. టీడీపీ బేజారు)
Comments
Please login to add a commentAdd a comment