పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!? | NSA Ajit Doval lunch with Kashmiris, Ghulam Nabi says Money can Buy Anyone | Sakshi
Sakshi News home page

పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?

Published Thu, Aug 8 2019 10:46 AM | Last Updated on Thu, Aug 8 2019 1:04 PM

NSA Ajit Doval lunch with Kashmiris, Ghulam Nabi says Money can Buy Anyone - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో కశ్మీర్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్‌ లోయలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి దోవల్‌ స్వయంగా పర్యటించారు. ఈ సందర్భంగా షోపియన్‌ జిల్లాలో స్థానికులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్థానికుల్లో విశ్వాసం కల్పించేలా స్థానికులతో మాటా-మంతి కలిపారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయని దోవల్‌ వారిని ప్రశ్నించగా.. అంతా బాగుందని వారు బదులిచ్చారు.

‘ఔను. అంతా కుదురుకుంటుంది. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించే రోజులు వస్తాయి. ఆ భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మీ భద్రత, సంక్షేమం కోసం మేం తపిస్తున్నాం. రానున్న తరాల అభివృద్ధి సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నాం’ అని దోవల్‌ వారితో తెలిపారు. మీ పిల్లలకు మంచి విద్య అందించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారిలో దోవల్‌ భరోసా నింపారు. ఈ మేరకు షోపియన్‌ జిల్లాలో స్థానికులతో దోవల్‌ భోజనం చేస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కేంద్రం నిర్ణయాలను స్థానికులు స్వాగతిస్తున్నారని, లోయలో పరిస్థితులు అంతా సవ్యంగా ఉన్నాయని దోవల్‌ ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, షోపియన్‌లో స్థానికులతో దోవల్‌ భోజనం చేసిన వీడియోపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, జమ్మూకశ్మీర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పెదవి విరిచారు. పైసాలిస్తే ఎవరైనా మీతో కలిసివస్తారంటూ ఆయన ఎద్దేవా పూర్వకంగా వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement