
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వాన్ని నడపడం దినదిన గండంగా మారిందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక బాధలు, సంకీర్ణ సమస్యల నడుమ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. సీఎంగా తప్పని పరిస్థితుల్లో ఈ పదవిలో కొనసాగుతున్నానని, ప్రభుత్వాన్ని నడపడం సవాలుగా మారిందని సంకీర్ణంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంగా తన విధిని నిర్వర్తించడంలో రోజూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కాగా సంకీర్ణ ప్రభుత్వంపై కుమారస్వామి ఇదివరకే అనేకసార్లు బహిరంగ వేదికలపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్‌తో కూడిన కూటమితో జేడీఎస్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న అసంతృప్తులు కూమరస్వామిని గద్దేదించే ప్రయత్నం చేస్తూన్నారంటూ జేడీఎస్‌లో అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త సభ్యుల చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నట్టు సమాచారం. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్, బళ్లారి ఎమ్మెల్యే నాగేంద్రతో పాటు మరికొందరు ఢిల్లీలో బీజేపీ నాయకులతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని.. ఓ వర్గం నేతలు విశ్లేషించుకుంటున్నారు. ఈ పరిణామం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.