సాక్షి, మహబూబాబాద్ : ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ విశ్వేశ్వరరెడ్డికి సముచిత స్థానం కల్పించిందని, ఎంపీగా గెలిపించి.. అత్యధిక సార్లు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం కల్పించిందన్నారు. ఆర్థికంగా లబ్ధిపొంది ఇప్పుడు సిద్ధాంతాల పేరుతో రాద్ధాంతం చేయటం తగదని హితవు పలికారు. టీఆర్‌ఎస్.. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందంటున్న విశ్వేశ్వరరెడ్డి ఈ నాలుగేళ్లు ఏమి చేశారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డితో భూముల వివాదం కారణంగానే కొండా పార్టీ మారారన్నారు. మహేందర్ రెడ్డి తెలంగాణ ద్రోహి అయితే ఆయనతో కలిసి ఎంపీగా ఎలా పోటీ చేశావని ప్రశ్నించారు.
పార్టీకి వెన్నుపోటు పొడిచి తన మనషులైన పైలెట్ రోహిత్ రెడ్డి, కేఎస్ రత్నం, కనకయ్యలను ఇతర పార్టీలకు పంపారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రాజెక్టును ఆపాలని కేంద్రాన్ని కోరింది చంద్రబాబు కాదా..? పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలతో కలిసి ఎలా పని చేస్తావ్..? అంటూ ప్రశ్నించారు. ఏ సిద్ధాంతాలతో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment