
సాక్షి, నోయిడా : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. యోగి ఆధునికవాది కాదు అని మాట్లాడుకునే వారందరికి నేటి ఆయన అడుగు కనువిప్పు అన్నారు. యోగి అంటే ఏమిటో ఇప్పటికే అందరికీ అర్ధమైందనుకుంటున్నాను అని చెప్పారు. క్రిస్టమస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ నోయిడాకు కొత్త మెట్రో రైల్ ప్రారంభించారు. అయితే, నోయిడాకు శాపగ్రస్త నగరం అనే పేరున్న కారణంగా గతంలో ముఖ్యమంత్రులు అయిన వారెవ్వరూ కూడా ఆ నగరంలో అడుగుపెట్టే సాహసం చేయలేదు. కానీ, తొలిసారి సీఎం యోగి మాత్రం నోయిడాలో మెట్రో ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ యోగి ముందడుగును ప్రశంసించారు.
‘యోగి వేసుకున్న బట్టల ఆధారంగా ఆయన ఆధునికవాది కాదని అందరూ అనుకుంటారు. కానీ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం యోగి చేశారు. నోయిడాకు శాపం ఉందనే విషయాన్ని పక్కకు పెట్టి ఆయన నగరంలో అడుగుపెట్టారు. నమ్మకం అనేది ముఖ్యం.. గుడ్డి నమ్మకం ఆహ్వానించదగినది కాదు’ అని మోదీ అన్నారు. ’నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లోకి అడుగుపెట్టవద్దని చాలా మంది చెప్పారు. కానీ, నేను మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదు. వారు వద్దు అని చెప్పిన ప్రతి చోటులో అడుగుపెట్టి చూశాను. ఎన్నో ఏళ్లుగా క్షుద్రపూజలపై, మంత్ర శక్తులపై, శాపాలపై నమ్మకంతో పలువురు నాయకలు కొన్ని ప్రాంతాల్లో అడుగే పెట్టలేదు. ఇది ఎంతటి దురదృష్టం. అసలు అలాంటివి నమ్మి ఆ ప్రాంతాలకు దూరంగా ఉండేవాళ్లు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అనర్హులు’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment