
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్వకుంట్ల వారి కుటుంబ రాజ్యాంగమే అమలవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారన్నారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విస్మరించి కల్వకుంట్ల రాజ్యాం గాన్ని అమలు చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాలను టీఆర్‌ఎస్ పార్టీ సమావేశాలుగా నిర్వహించారంటూ ఆక్షేపించారు.
పంచాయతీరాజ్ చట్టంలో మార్పుల ద్వారా గ్రామ సభలకు కోరలు పీకారని విమర్శిం చారు. కలెక్టర్లకు అధికారం కట్టబెట్టారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారికి విలువ లేకుండా పోయిందన్నారు. పేదలకు ఉన్నత విద్యను దూరం చేయడానికే ప్రైవేటు వర్సిటీల బిల్లును ఆమోదించారని ఆరోపించారు. కాగ్ రిపోర్ట్ కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. కాగ్ నివేదికపై సీఎం సమాధానం చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.