సాక్షి, పులివెందుల: పోలీసులు తమ పక్షపాత ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నారు. యురేనియం టెయిలింగ్ పాండ్ సమస్యను తీర్చాలని సమస్యను పరిష్కరించాలని ధర్నా చేసిన ఎంపీపీ లింగాల ఉషారాణి, ఎంపీటీసీ శ్రీరామిరెడ్డి మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి... యురేనియం టెయిలింగ్ పాండ్ సమస్యను తీర్చాలని కొన్ని నెలలుగా యురేనియం అధికారులను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వేముల ఎంపీపీ లింగాల ఉషారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు కోరుతున్నప్పటికీ యురేనియం అధికారులు ఆ సమస్యను తీర్చకుండా రైతులకు మభ్యపెట్టే మాటలు చెబుతూ కాలయాపన చేస్తూ వస్తున్నారు.
రెండు నెలలక్రితం ఎంపీ ఢిల్లీలో సీఎండీ అస్నాని కలిసి టెయిలింగ్ పాండ్ వల్ల ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తేగా, ఆయన ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పుడు నెలరోజుల్లోపు పరిష్కారం చూపుతానని, మళ్లీ ఇక్కడ పర్యటిస్తానని బాధిత రైతులకు హామీ ఇచ్చి ఇప్పటివరకూ ఆ సమస్యను పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఎంపీపీ ఉషారాణి రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కానీ నాలుగు రోజుల క్రితం మండలానికే చెందిన టీడీపీ నాయకుడు యురేనియం ప్రాజెక్టు వద్ద యురేనియం అధికారులు, ఉద్యోగులను ప్రాజెక్టు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని దాదాపు వందమందితో ధర్నా చేశారు. అంతచేసినా పోలీసులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కేవలం అధికారపార్టీలో ఉన్నారు కాబట్టే వారిపై కేసులు నమోదు చేయకుండా వదిలేశారని, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం వల్లే తమపై కేసులు నమోదు చేసి పక్షపాతం చూపుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని యురేనియం బా«ధిత రైతులు పేర్కొంటున్నారు.
టెయిలింగ్ పాండ్ వల్ల ఇప్పటికే తమ పంటలు పండక తాగునీరు, సాగునీరు కలుషితమై మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీపీ ప్రజల కోసం ధర్నా చేశామని, ఇంతమాత్రానికే కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా ఈ ప్రభుత్వం హరించేస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment