
రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తమ్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులు వద్దని.. అమరావతిలో మత్రమే రాజధాని ఉండాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా ప్రమాదకరమని మేధావుల ఫోరమ్ కన్వీనర్ పురుషోత్తమ్‌రెడ్డి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాలని నాడు శివరామకృష్ణన్.. చంద్రబాబుకు లేఖ రాయలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన 8 నగరాలు ఉండగా అమరావతి పేరుతో కొత్త నగరమెందుకని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి రూ. 6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని 14వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు తిరుపతిలో లేఖ ఇవ్వలేదా అని, మరి ఇప్పుడు అమరావతి కోసం ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఎలా చెబుతారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వనరులను తాకట్టు పెట్టి.. ఇప్పుడు అమరావతి నిర్మాణమంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా నష్టపోతాయన్నారు. అమవరావతి వెనుక అన్ని రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే కన్సిస్తున్నాయని, ఎంపిక చేసిన సంస్థలు, వ్యక్తుల కోసమే అమరావతి నిర్మాణం తప్ప... ప్రజల రాజధాని కాదని పేర్కొన్నారు.
కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి నుంచి రాయలసీమ వ్యతిరేకి అని, నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వెడల్పు పెంచడానికి ప్రయత్నిస్తే బాబు అడ్డుకోలేదా అంటూ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటిమట్టం కోసం వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలను ఆయన వ్యతిరేకించలేదా అని ప్రశ్నించారు. ప్రధాని శంఖుస్థాపన చేసిన అమరావతిని ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తున్న చంద్రబాబు... మరి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేసిన మన్నవరాన్ని తరలించ లేదా అని ధ్వజమెత్తారు. రాయలసీమ టీడీపీ నేతలు అమరావతి బానిసలలా వ్యవహరిస్తున్నారని, బాబు పర్యటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంటామని, రూ. 25వేల కోట్లతో రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంఖుస్థాపనలు కూడా చేశారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిని సాధిస్తాయన్నారు.