
న్యూఢిల్లీ: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన సైద్ధాంతిక పోరు కొనసాగిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ఆమె అన్నారు. తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ విభజన వాద శక్తులపై తమ సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ రాజ్యాంగ సంస్థలను నాశనం చేయడానికో, ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకో, బెదిరించటానికో దివంగత రాజీవ్ దానిని ఒక అవకాశంగా తీసుకోలేదని పరోక్షంగా మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘1989 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ సీట్లు గెలుచుకోకపోవడంతో, ఏకైక పెద్ద పార్టీ అయినప్పటికీ రాజీవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. రాజీవ్ నిజాయితీని, మనస్సాక్షినే నమ్ముతారనేందుకు ఇదే నిదర్శనం’ అని తెలిపారు. రాజీవ్ నమ్మి, ఆచరించిన విలువలను కొనసాగించేందుకు పునరంకితం కావాలని, అదే రాజీవ్‌కు ఘనమైన నివాళి అని కార్యకర్తలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.
రాజీవ్ వల్లే భారత సమాఖ్య బలోపేతం
మాజీ ప్రధాని రాజీవ్ హయాంలో కుదిరిన పంజాబ్, అస్సాం, మిజోరం ఒప్పందాల వల్లే మన సమాఖ్య మరింత బలోపేతమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సాధించిన విజయాలను రాహుల్ గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment