సాక్షి, కర్నూలు: అధికార పార్టీ నేతల మధ్య రోజురోజుకూ విభేదాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎంపిక విషయంలో అధికార పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు సూచించిన పేరును మరొకరు ఒప్పుకోవడం లేదు. పాలక మండలిలో తమ అనుచరులే ఉండాలంటూ ఎవరికి వారు బెట్టు చేస్తున్నారు.
వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఏమాత్రమూ ఫలించలేదని సమాచారం. ఫలితంగా మార్కెట్ కమిటీ పాలక మండలి నియామకంలో జాప్యమవుతోంది. నేతల వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. టీడీపీలోని సీనియర్ నేతలకు కూడా ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు. తాజాగా బుధవారం నగరంలోని అశోక్‌నగర్‌లో జరిగిన వివిధ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. పోలీసుస్టేషన్‌లో ఇరు వర్గాలు కేసులు కూడా నమోదు చేయించడం గమనార్హం.
ఫిర్యాదుల మీద ఫిర్యాదులు
కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్–చైర్మన్, డైరెక్టర్ల నియామకం విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ ఎవరికి వారుగా పేర్లను సిఫారసు చేశారు. ప్రధానంగా చైర్మన్, వైస్–చైర్మన్ నియామకం విషయంలో రగడ మొదలయ్యింది. పెరుగు పురుషోత్తంరెడ్డి విషయంలో పాణ్యం నియోజకవర్గంతో పాటు కర్నూలు నియోజకవర్గానికి చెందిన పాతతరం టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన్ను చైర్మన్‌గా నియమించొద్దంటూ పార్టీ కార్యాలయం వద్ద గొడవ చేయడంతో పాటు జిల్లా అధ్యక్షుడికి తమ అసమ్మతిని లిఖితపూర్వకంగా తెలియజేశారు.
అంతటితో ఆగకుండా విజయవాడకు వెళ్లి మరీ సీఎం కార్యాలయ (సీఎంవో) అధికారులతో పాటు పార్టీలోని ముఖ్య నేతలను కలిశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని కొత్త వారిని అందలం ఎక్కిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. వీరిని చల్లపరిచేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. మరోవైపు వైస్–చైర్మన్ నియామకం విషయంలో కూడా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి వైస్–చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ఆక్షేపిస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జరిగిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని సమాచారం. ఫలితంగా రేసు నుంచి అబ్బాస్ పేరును తొలగించినట్టు తెలుస్తోంది.
సీటుకో బేరం
ఒకవైపు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరికొందరు నేతలు ఇదే అదనుగా రంగంలోకి దిగి వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పదవులు వచ్చేలా చేస్తామంటూ భారీ మొత్తాలను వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక నేత ఏకంగా కోటి రూపాయల వరకూ వసూలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పదవి వచ్చే వ్యక్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం చేయాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇంత మొత్తాలను కూడా ఇచ్చి పదవి పొందేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారంటే.. ఏ మేరకు ఆదాయం ఉందో అనే అనుమానాలు ఇప్పుడు అందరికీ తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కర్నూలు మార్కెట్ కమిటీ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ మరింత హీటెక్కడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment