
సాక్షి, బెంగుళూరు : సిద్ధరామయ్య అసమర్థ ముఖ్యమంత్రి అని ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని సినీనటుడు సాయికుమార్ విమర్శించారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు రాజకీయంగా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా పవిత్ర జలం.. పవిత్ర మట్టి అంటూ మోదీని కీర్తించిన తెలుగుదేశం పార్టీ నేతలు, విమర్శించడంలో అర్థం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని.. అది వాస్తవం అని, వైఎస్ జగన్‌ను ఫాలో అవడమే టీడీపీ విధానమా అంటూ సాయికుమార్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీకి సొంత ఆలోచనలు, విధానాలు ఉండాలని టీడీపీ నేతలకు సూచించారు, తెలుగుదేశం పార్టీ, నేతలకు అవి ఏమాత్రం లేవంటూ దుయ్యబట్టారు. తన తోటి నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేశపరుడంటూ వ్యాఖ్యానించారు. మోదీని టార్గెట్ చేయడం తనకు నచ్చలేదన్నారు. దేశంలో ఏది జరిగినా ప్రధాని మోదీనే కారణం అని అనడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిపోయిందని, అది వారి అవివేకం అంటూ మండిపడ్డారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాయి కుమార్ బీజేపీ తరపున బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.