
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత వీడటం లేదు. బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. ముఖ్యమంత్రి పదవిని తామే చేపడతామని బీజేపీ స్పష్టం చేయగా.. శివసేన మాత్రం సీఎం పదవిపై ఆశలు వదులుకోవడం లేదు. అధికార పంపిణీకి సంబంధించి ఇరు పార్టీల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఎన్సీపీ శివసేనకు మద్దతుగా నిలుస్తుందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య భేటీ రాష్ట్ర బీజేపీని కొద్దిపాటి కలవరాన్ని గురిచేసింది.
ఈ భేటీ అనంతరం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా శరద్‌పవార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని అన్నారు. తాము మహారాష్ట్ర రాజకీయల గురించి కూడా మాట్లాడుకున్నామని తెలిపారు. ఎన్సీపీ మద్దతు కోరేందుకే సంజయ్ రౌత్ శరద్‌పవార్‌ను కలిశాడని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు బీజేపీ కూడా శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అలా జరగని పక్షంలో స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కొందరు ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గురువారం జరిగిన శివసేన శాసనసభపక్ష సమావేశంలో.. ఆ పార్టీ పక్షనేతగా ఏక్‌నాథ్ షిండేను ఎన్నుకున్నారు. అలాగే శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సాయంత్రం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిను కలిశారు. అనంతరం ఆదిత్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే తీసుకుంటారని వెల్లడించారు. ఈ విషయంలో పూర్తి అధికారాలు ఆయనకే అప్పగించినట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి.