
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు అజయ్‌షా మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2జీలో స్కామ్ జరిగిందని బీజేపీ చేసిన ఆరోపణలకు అప్పటి యూపీఏ ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు.
కోర్టు వారిని విచారణలో నిర్దోషులని తేల్చిందన్నారు. తమ పార్టీ నేతలపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించే సత్తా బీజేపీకి ఉందా అని షబ్బీర్ ప్రశ్నించారు. అమిత్‌షా కొడుకు అజయ్‌షా, విజయ్ మాల్యా, అదాని, ముఖేశ్ అంబానీ తదితరుల మీద వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయంగా ప్రయోజనం పొందారని విమర్శించారు.