సాక్షి, న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోదీ నిర్ణయాన్ని మార్చుకోవాలని వేలాదిమంది కోరుతున్నారు. మరోవైపు విపక్ష నేతలు కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ద్వేషాన్ని విడనాడు.. సోషల్ మీడియాను కాదు ’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ ప్రకటపై కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కూడా స్పందించారు.
దేశంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించే దిశగా వేస్తున్న తొలి అడుగే మోదీ ప్రకటన అని ఆరోపించారు. మోదీ ప్రకటన దేశ వ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాపై నిషేధం విధించేందుకు తొలి చర్యగానే దీన్ని తాను భావిస్తున్నానని చెప్పారు. మంచితో పాటు, ఉపయోగకరమైన సందేశాలను పంచుకునేందుకు సామాజిక మాధ్యమాలు ఉపయోగపడతాయనే విషయం ప్రధానికి కూడా తెలుసని అన్నారు.
(చదవండి : ప్రధాని మోదీ సంచలన ట్వీట్!)
‘మీరు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కాదు.. వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసే, బెదిరించే, హెచ్చరించే మీ ఆర్మీకి ఈ సలహా ఇవ్వండి– ఇట్లు భారత పౌరులు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జెవాలా వ్యంగ్య ట్వీట్ చేశారు.
కాగా, ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో మోదీ చాలా చురుగ్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్‌లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment