ముంబై: అత్యంత నాటకీయంగా వ్యవహరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని అథమస్థాయికి దిగజార్చారని బీజేపీ కలహాల మిత్రపక్షం శివసేన విరుచుకుపడింది. ప్రధాని మోదీ అభివృద్ధిని ప్రస్తావించేందుకు బదులు.. మొఘల్ కాలపు సమాధులను తవ్వుతున్నారని విమర్శించింది. 'ఇదే కారణంతో కాంగ్రెస్ పార్టీని గుజరాత్ ప్రజలు 22 ఏళ్లపాటు తిరస్కరించారు. ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రంలో అభివృద్ధి, ప్రగతి అంశాలను పక్కనబెట్టి.. 'నువ్వెంత-నేనెంత' స్థాయికి దిగజారారు' అని శివసేన అధికార ప్రతిన 'సామ్నా' తన సంపాదకీయంలో విరుచుకుపడింది.
మోదీ ప్రచారంలో ఊరికే భావోద్వేగానికి లోనువుతున్నారని, అతి దురుసుతనం ప్రదర్శిస్తున్నారని, ఇంత అట్టడుగుస్థాయి ప్రచార ఎత్తుగడలకు బీజేపీ దిగాల్సిన అవసరమేముందని శివసేన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్క రాహుల్ గాంధీని ఓడించడానికి ప్రధాని, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి,అగ్రనేతలు అంతా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. రాజకీయ నిరుద్యోగి అయిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మోదీని ఉద్దేశించి చేసిన 'నీచ్' వ్యాఖ్యలను చేశారని, ఈ వ్యాఖ్యల విషయంలో మోదీ అతిగా స్పందించారని శివసేన విమర్శించింది.
అయ్యర్ ఈ వ్యాఖ్యల ద్వారా తననే కాదు.. గుజరాత్ ప్రజలను కూడా అవమానించారని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. 'మోదీ జాతీయ నాయకుడిగా కంటే ప్రాంతీయ నాయకుడిగానే తనను తాను భావించుకుంటున్నారు. ఆయన ప్రజలందరి గౌరవ ప్రతిష్టల కోసం, హిందూ దేశ ప్రతిష్ట కోసం నిలబడాలని మేం కోరుకుంటున్నాం. కానీ, ఆయన ఇప్పటికీ గుజరాతీ భావనలోనే ఇరుక్కుపోయారు' అని సామ్నా మండిపడింది. 'ఆయన జాతీయ నాయకుడి కన్నా ప్రాంతీయ నాయకుడిగానే చెప్పుకుంటున్నారు. కానీ ఎవరైనా ప్రాంతీయ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే.. జాతీయవాదం కత్తితో వారి గొంతులను వెంటనే నొక్కేస్తున్నారు' అని పేర్కొంది. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటుందన్న ప్రధాని వ్యాఖ్యలను సైతం శివసేన తప్పుబట్టింది. గుజరాత్ ప్రచారం భావోద్వేగ ప్రసంగాలు, కన్నీళ్లు, శివతాండవాలతో అత్యంత నాటకీయంగా మారిందని.. ప్రధాని మోదీ దేశ ప్రజలే నా కుటుంబం అన్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment